Ys Jagan’s Plan :ఉద్యోగ సంఘాలు తలపెట్టిన సమ్మె ఉపసంహరించబడింది. దాంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుంచీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ విషయమై ఒకే పట్టుదలతో వుంది. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు యాగీ చేయాలనుకున్నా ఫలితం లేకుండా పోయింది.
కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన వైనాన్ని అర్థం చేసుకోకుండా ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. కొత్త పీఆర్సీ విషయమై భిన్న వాదనలు వున్నా, కొందరు ఉద్యోగులు తమకు కొత్త పీఆర్సీ వల్ల కలిగిన లాభం పట్ల సానుకూలంగానే వున్నారు. అయితే, కొందరు మాత్రం తమ వేతనాలు తగ్గాయనే ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఐఆర్ సహా పలు అంశాల్లో ప్రభుత్వం, ఉద్యోగుల మేలు దిశగానే అడుగులేసిందనీ, ఈ క్రమంలోనే రాష్ట్రంపై 20 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడబోతోందనీ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అయినాగానీ, ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. అయితే, కొంతమంది ఉద్యోగుల్లో నెలకొన్న అయోమయాల నేపథ్యంలో, ఎవరికీ జీతాలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఉద్యోగులు బలప్రదర్శన చేసినా, చివరికి చర్చలతోనే సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల్ని, మంత్రుల కమిటీ.. ఉద్యోగులకు వివరించడం, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించడం.. వెరసి, సుదీర్ఘంగా కొనసాగిన చర్చల ప్రక్రియ సుఖాంతమయ్యింది.
అయితే, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సీపీఎస్ సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నాయి. దాంతో, ఉద్యోగ సంఘాలన్నీ తిరిగి ఉద్యమబాట పట్టే అవకాశం లేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మొత్తానికి ప్రస్తుతానికైతే సమ్మె ప్రమాదం తొలగినట్టే.