విశాఖలో వైఎస్ జగన్ కాపురం.! దేనికి సంకేతం.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కాపురం పెట్టబోతున్నారట.! అది కూడా సెప్టెంబర్‌లోనట. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్త పోర్టుకి శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్, తదనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు మామూలే.! ఆ సంగతి పక్కన పెడితే, విశాఖకు వచ్చేస్తున్నాననీ, సెప్టెంబర్‌లో కాపురం పెడతాననీ వైఎస్ జగన్ ప్రకటించడమే కాస్తంత ఆశ్చర్యకరం.! మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాక తరచూ ‘విశాఖకు వచ్చేస్తున్నా..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇదిగో ఉగాది, అది దసరా, అల్లదిగో సంక్రాంతి.. అంటూ ఏళ్ళు గడిపేస్తున్నారు.. కానీ, అమరావతి నుంచి ఆయన కదలడంలేదు.!

అమరావతిని కమ్మరావతిగా అభివర్ణిస్తూ, ఆ అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేస్తూ, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్నూలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెబుతున్నా, గత కొంతకాలంగా కర్నూలు సోదిలో లేకుండా పోయింది.

మొన్నటికి మొన్న పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా విశాఖ వచ్చేస్తున్నట్లు చెప్పారు వైఎస్ జగన్. కానీ, కుదరలేదు. ఇప్పుడేమో సెప్టెంబర్ అంటున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో వున్నందున, ‘కాపురం’ అనే మాటనే ప్రస్తావిస్తున్నారిప్పుడు వైఎస్ జగన్. కానీ, జగన్ మాటల్ని నమ్మొచ్చా.?