వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పుమంటోన్న విషయం విదితమే. ‘వైఎస్ వివేకానందరెడ్డి గుండె పోటుతో చనిపోయారా.? గొడ్డలిపోటుతో చనిపోయారా.? గుండె పోటుతో చనిపోతే, గొడ్డలితో చేసిన గాయాలెందుకున్నాయ్.? గొడ్డలి వేటుకి ప్రాణాలు కోల్పోతే, గుండె పోటు అని ఎందుకు చెప్పారు.?’ అంటూ టీడీపీ పదే పదే ప్రశ్నిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడు.? ఆ అవసరం ఆయనకేముంది.? ఓ కన్ను ఇంకో కంట్లో పొడుస్తుందా.? తన వేలితో తన కంట్లో ఎవరైనా పొడుచుకుంటారా.? అని ప్రశ్నించారు వైఎస్ జగన్.
నిజమే, వైఎస్ వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం వైఎస్సార్ కుటుంబంలో ఎవరికైనా ఎందుకు వుంటుంది.? కానీ, ఇది రాజకీయం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయంగా చంద్రబాబు, స్వర్గీయ నందమూరి తారకరామారావుని వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీనే చెబుతుంటుంది.
ఒక్కటి మాత్రం నిజం. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది తేలాలి. అది తేలనంతకాలం, వైసీపీ మీద, వైసీపీ నాయకుల మీద ఆరోపణలు వస్తూనే వుంటాయ్. ఎందుకంటే, అవినాష్ రెడ్డి మీద పరోక్షంగా ఆరోపణలు చేసింది సాక్షాత్తూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత.
సీబీఐ దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద ఆరోపణలు వెలుగు చూశాయి.. ఆయన్ని సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది.. ఇటీవల అరెస్టు చేసింది కూడా.