పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆయన శాఖే అది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు చెయ్యగలిగిందేమీ లేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయమై రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నా ఏం చేసేది లేదు.
తన రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తుంది గనుక, క్రెడిట్ రాష్ట్ర స్థాయి పార్టీలకు ఇవ్వాలని బీజేపీ అనుకోదు. అదే పోలవరం ప్రాజెక్టుకి శాపమవుతోందన్నది నిర్వివాదాంశం. లేకపోతే, పోలవరం ప్రాజెక్టు ఇన్నేళ్ళపాటు ఎందుకు సాగుతుంది.?
సరే, పోలవరం ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే, ఆ శాఖకు సంబంధించి మాట్లాడటానికేమీ లేదు గనుక, జనసేన పార్టీని తిట్టే బాధ్యతని అంబటి రాంబాబు తన భుజాన వేసుకున్నారు. అంబటిని జనసేనాని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంబటి అడ్డంగా బుక్కయిపోతున్నారు.
వైసీపీలో ఏమంత్రిపైనా రానన్ని ఆరోపణలు అంబటి మీద వస్తున్నాయి. మంత్రిగా అంబటి రాంబాబు తన శాఖ వ్యవహారాలు సరిగ్గా చూసుకుంటే, ఈ ఆరోపణలు ఆయన్ని ఏమీ చేయవు. కానీ, శాఖాపరమైన పనులేమో చెయ్యడానికి లేవు. కానీ, అవినీతి.. అక్రమాలంటూ అంబటిపై విమర్శలొస్తున్నాయి.
‘మాకు అవసరాలుంటాయ్..’ అని అంబటి రాంబాబు ఏ టోన్‌లో అన్నారోగానీ, ఇటీవల గుంటూరులో ఓ ఐదు లక్షల పరిహారం విషయమై సగం వాటా కొట్టేయడానికి అంబటి ప్రయత్నించారన్న ప్రచారంతో వైసీపీ పరువు పోయింది. దాంతో, వైఎస్ జగన్.. మంత్రి అంబటికి వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.