ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 1 వరకూ ఆగితే ఎగ్జిట్ పోల్ ఫలితలు, జూన్ 4న అసలు ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎవరి విశ్లేషణలు వారు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా కూటమి గెలుపు కన్ఫాం అన్నట్లు ఆ పార్టీల అనుకూల మీడియా కథనాలు వండి వార్చేస్తుంది! జగన్ గెలుపు అసాధ్యమని.. అత్యధికంగ పోలింగ్ శాతం నమోదవ్వడమే ఇందుకు కారణం అని ఊదరగొడుతుంది.
అవును… ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాలకు కాస్త సమయం వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో… ఒక వర్గం మీడియా రాతలు వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా… సీఎం జగన్ పై కోపంతోనే జనాలు పెద్ద ఎత్తున పోటెత్తి ఓటేసినట్లు వారి కథనాలు చెబుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడమే ఇందుకు వారు చెబుతున్న కారణం.
అంటే… ప్రజలు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వేశారంటే అందుకు కారణం ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేయడమే అని చెబుతున్నారు. అది ఓల్డ్ విశ్లేషణ అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ అనుకూల ఓట్లు కూడా పెద్ద ఎత్తున పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. తమకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ పోతాయో అనే భయంతో కూడా ఓటు వేసి ఉంటారని మరికొంతమంది చెబుతున్నారు.
2019 ఎన్నికల సమయంలో ఏపీలో జనాలు వేసిన ఓట్లు కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది తెలిసిన విషయమే. 2014 – 19 మధ్యలో ప్రజల వ్యతిరేకతను చంద్రబాబు & కో బలంగా ఎదుర్కొందనే విషయం దాదాపుగా సుస్పష్టం! అయితే 2019 – 24 మధ్య నిజంగా జగన్ పై కూడా చంద్రబాబుపై ఉన్నంత వ్యతిరేకత ఉందా అంటే… బలంగా చెప్పలేని పరిస్థితి!
ప్రధానంగా పోలింగ్ స్టార్ట్ అవ్వగానే, ఉదయాన్నే.. వృద్ధులు, మహిళలు క్యూ లైన్ వద్ద ఉండటం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదనేది పలువురు అభిప్రాయం. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. 2014లో ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రకటించిన మేనిఫెస్టో పూర్తిగా కాదు.. సగంలో సగం కూడా అమలు కాలేదనేది నిర్వివాదాంశం! ఆన్ లైన్ లో మేనిఫెస్టోను మాయం చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
కానీ జగన్ పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగిందనే చెప్పాలి. 2019లో నవరత్నాల పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలుచేయడం, జనాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపైనే ప్రధానంగా ఆయన దృష్టి సారించారు. అందుకు జగన్ చిత్తశుద్ధిని పరీక్షించడానికన్నట్లు కోవిడ్ వంటి పరిస్థితులు వచ్చినా.. తగ్గలేదు. ఇది కచ్చితంగా జగన్ నిబద్దతనే చెప్పాలి. పైగా… 2019 మేనిఫెస్టోను తాను అమలుచేసినట్లు నమ్మితే, తన పాలన నచ్చితేనే ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు.
ఈ కారణాలు చూపిస్తూనే… ఇది ప్రభుత్వ సానుకూల ఓటు వెల్లువ అని వైసీపీ బలంగా చెబుతోంది. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు తదితర హామీల విషయంలో జగన్ ప్రభుత్వం దోషిగా నిలిచినప్పటికీ… మిగిలిన 98 శాతం జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా… 2019 సమయంలో చంద్రబాబుపై ఉన్నంత కసిమాత్రం 2024లో జగన్ పై లేదని చెప్పేవారే ఎక్కువ! మరి ఈ అత్యధిక శాతం పోలింగ్ వెనకున్న అసలు ఉద్దేశ్యం తెలియాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే!