నాన్న ఆశయ సాధన కోసం ఎందాకైనా… జగన్ ఎమోషనల్ ట్వీట్!

ఈ రోజు దివంగత వైఎస్సార్ జన్మదినం సందర్భంగా… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాలు ఘనంఘా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా సీఎం జగన్ ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జన్మదినాన్ని ఏపీ ప్రభుత్వం “రైతు దినోత్సవం”గా నిర్వహిస్తోంది.

వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మధ్య నుంచి దూరమై 14 సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ను పూర్తిగా వ్యతిరేకించే టీడీపీ సైతం వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తొలగించే సాహసం చేయలేని పరిస్థితి. అది సంక్షేమ పథకాల విషయంలో వైఎస్సార్ విజన్.

తన పాలనలో ఒక సామాజిక శాస్త్రవేత్తగా మారారు వైఎస్సార్. మరిముఖ్యంగా పాదయాత్ర సమయంలో ఆయన పడిన కష్టం, ప్రజలను అర్ధంచేసుకున్న విధానం అద్భుతమని శత్రువులు సైతం అభిప్రాయపడిన పరిస్థితులు నాడు జరిగాయి! పార్టీ ఇచ్చిన పాత కాలపు ఎజెండా కాపీలను చించేసి.. ప్రజల ఎజెండాను జెండాగా చేసుకుని పాలన సాగించిన మహోన్నత వ్యక్తి, ప్రజల మనసుల్లో తిరుగులేని శక్తి వైఎస్సార్ అన్నా అతిశయోక్తి కాదు!

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తన తండ్రి జయంతి సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన జగన్…

“ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు”

అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేశారు.