మరోసారి ఢిల్లీ పర్యటన ఆలోచనలో జగన్ 

Ys jagan
 ఎపి రాష్ట్ర హైకోర్టు లోని కొందరు న్యాయమూర్తులతో సహా సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణపై పలు ఆరోపణలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయడం, ఆ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లమ్ మీడియా సమావేశం ద్వారా ప్రకటించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఆ విషయం పై కొందరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపగా ఎల్లో మీడియా మాత్రం పట్టించుకోలేదు.  ఒకరోజు మౌనంగా ఉన్న పచ్చ మీడియా మళ్ళీ చెలరేగి ముఖ్యమంత్రిని విమర్శిస్తూ యధాప్రకారంగా వార్తలు వండి వారుస్తున్నాయి.  జాతీయస్థాయిలో కొందరు మాజీ న్యాయమూర్తులు, మేధావులు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి  బాహాటంగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ, న్యాయస్థానాల్లో తెరపై కనిపించని కొన్ని లొసుగులను బయటపెట్టడం జరిగింది.  అయితే ఇవి కొత్త ఏమీ కాదు.  ఎప్పటినుంచో వినపడుతున్నవే.  
 
Ys jagan
Ys jagan

చెప్పుకోదగిన ప్రతిస్పందన ఎక్కడ? 

అయితే నిజాన్ని నిష్కర్షగా చెప్పుకోవాలంటే  న్యాయవ్యవస్థపై జగన్ మోహన్ రెడ్డి ఎక్కుపెట్టిన ఆరోపణాస్త్రాలు జాతీయస్థాయి మీడియాలో చర్చనీయాంశం చెయ్యడంలో వైసిపి మీడియా విభాగం, సలహాదారులు  విఫలం అయినట్లు కనిపిస్తున్నది.  ఏదో ఒకటి రెండు ప్రస్తావనలు మినహా న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు తీవ్రమైన చర్చలకు నోచుకోలేదు.  నిజానికి జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏ విధంగా చూసినా సామాన్యమైనవి కావు.  ఆయన తన పరువు మర్యాదలు, ప్రాణాలను సైతం పణంగా పెట్టి అవ్యవస్థల పట్ల సమరశంఖాన్ని పూరించారు అని చెప్పాలి.  జగన్ లేఖలో ప్రస్తావించిన అంశాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి అన్ని రాష్ట్రాలు, మేధావులు గొంతులు విప్పాల్సినంత తీవ్రమైనవి.  కానీ, ఆ తీవ్రత ఎక్కడా కనిపించలేదు.  న్యాయవ్యవస్థ పట్ల భయం కావచ్చు, గౌరవం కావచ్చు…రాజకీయనాయకుల పట్ల గూడు కట్టుకున్న వ్యతిరేకత కావచ్చు… దేశంలో చాలా ప్రభుత్వాలకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి.  కానీ, ఎవ్వరూ జగన్ కు బహిరంగ మద్దతును ప్రకటించలేదు.  జగన్ చేసిన ఆరోపణలు ఏ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రో, కర్ణాటక ముఖ్యమంత్రో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రో చేసి ఉన్నట్లయితే దేశంలో అన్ని భాషల ఛానెల్స్ పోటీలు పడి ఇరవైనాలుగు గంటలు చర్చలు నిర్వహించి దడదడలాడించేవి.  ఒక ప్రభుత్వాధినేత ఒక అంశం పై జాతీయస్థాయిలో అలజడి సృష్టించినపుడు దాన్ని మీడియా దృష్టిని ఆకర్షించడానికి పార్టీ విభాగాలు ముందుగా కసరత్తు చెయ్యాలి.  చర్చోపచర్చలు నిర్వహించడానికి మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ ను ఉపయోగించాలి.  కనీసం తెలుగు రాష్ట్రాలలోని మేధావులు, పాత్రికేయులు, తమపట్ల సానుకూలధోరణి కలిగిన ఛానెల్స్ వాళ్లు,   మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల మద్దతును కూడా వైసిపి పొందడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు.    ఇక్కడ అలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టం అవుతున్నది.  అదేదో జగన్ ఒక్కడే చూసుకుంటాడులే  అనే నిర్లిప్త భావం పార్టీ శ్రేణులలో ఏర్పడిందని అనుకోవాలి.  సోషల్ మీడియా మాధ్యమాలలో కనిపించే మద్దతును ఒక మద్దతు అనుకుంటే అంతకన్నా వెర్రితనం మరొకటి ఉండదు.  

గత చేదు అనుభవాల దృష్ట్యా చూస్తే…..

ఇక ఇప్పుడు అనేకమందిని ఆలోచింపజేస్తున్న అంశం ఏమిటంటే జగన్ చేసిన ఫిర్యాదుకు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది!   గతంలో కొందరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద వెలువడిన లైంగిక ఆరోపణలు, అవినీతి ఆరోపణల మీద కూడా సుప్రీమ్ కోర్ట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది కూడా ఆ దారిలోనే వెళ్తుందని కొందరు అనుభవజ్ఞులు నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.  లైంగిక ఆరోపణలు వచ్చిన ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు కూడా పంపించింది మోడీ ప్రభుత్వం.  అలాంటప్పుడు ఏవో కొన్ని న్యాయవిచారణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడినంత మాత్రాన ప్రధాన న్యాయమూర్తి కాబోయే వ్యక్తిపై విచారణ జరపడం, చర్యలు తీసుకోవడం అనుమానమే అని పలువురి అభిప్రాయం.  తమ వ్యవస్థకు రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించిన సార్వభౌమాధికారం లాంటి శక్తికి తామే విఘాతం కల్పించుకుంటాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  

వీరగంధాన్ని అందుకునే వీరులు ఎవరు?

ఒక న్యాయమూర్తిపై చర్య తీసుకోవాలంటే అది ఎంతటి జటిలకార్యమో తెలియనిది కాదు.  దానికి దేశవ్యాప్త మద్దతు, కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడగట్టాలి.  ఎవరో ఒక పార్టీ నాయకుడి కోసం న్యాయవవ్యస్థతో యుద్ధానికి ఎంతమంది సాహసిస్తారు అని రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.    దీనికి ముక్కుసూటితనమే కాదు..రాజకీయ చాణక్యం కూడా చాల అవసరం.  సోషల్ మీడియాలో పొగడ్తలు వేరు…వాస్తవప్రపంచంలో రాజకీయ మద్దతులు కూడగట్టడం వేరు.  హైకోర్టు న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేసినప్పటికీ, మళ్ళీ నిన్న రెండు తీర్పులు  ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చాయి.   దీన్నిబట్టి చూస్తే న్యాయవ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.   ఎందుకంటే న్యాయవ్యవస్థలో ఉన్న ఐక్యత రాజకీయ వ్యవస్థలో లేదు.  
 
ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఢిల్లీ పర్యటనకు సమాయత్తం కావడం చూస్తుంటే ఆయన వెనకడుగు వెయ్యడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని స్పష్టం అవుతోంది.  ఈసారి పర్యటనలో ఆయన ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కూడా కలవడానికి అనుమతులు కోరారని తెలుస్తున్నది.  కొన్ని క్షుద్ర మీడియా శక్తులు ఇదేదో జగన్ మోహన్ రెడ్డికి న్యాయవ్యవస్థకు మధ్య యుద్ధం అన్నట్లు, కొందరు న్యాయమూర్తులను జగన్ టార్గెట్ చేశాడు అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయి.   చంద్రబాబుకు మేలు జరుగుతుందనుకుంటే వారు ఎవరి వ్యక్తిత్వాన్నైనా హత్యచేయడానికి కూడా వెనుకాడరు.  ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి అభిమన్యుడిలా పద్మవ్యూహంలోకి లంఘించాడు.   లోపల అనేక దుష్టశక్తులతో, రక్కసులతో, జిత్తులమారులతో, వెన్నుపోట్ల వీరులతో పోరాడాల్సి ఉంటుంది.  ఆయన విజయుడై తిరిగి బయటపడాలని ఆశిద్దాం. 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు