నియోజకవర్గం నుంచి 50 మందితో వైఎస్ జగన్ ‘అభిప్రాయ సేకరణ’.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాల విషయంలో పక్కా క్యాలెండర్ అమలు చస్తూనే, ఇంకో వైపు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. పాలన పరంగా తీసుకుంటున్న చర్యలకు అదనంగా, పార్టీ పటిష్టత కోసం కూడా చర్యలు చేపడుతున్నారు వైఎస్ జగన్.
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ఇప్పటికే ప్రజా ప్రతినిథుల్ని ఇంటింటికీ పంపిస్తూ, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్న వైఎస్ జగన్, తానే స్వయంగా రంగంలోకి దిగి, మరింత లోతుగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు.

ఒక్కో నియోజకవర్గం నుంచీ 50 మందిని ఎంపిక చేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, పాలన పట్ల ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది.? వంటి అంశాల గురించి అభిప్రాయ సేకరణ చేస్తారు వైఎస్ జగన్.

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుడుతుండడం గమనార్హం. తద్వారా వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకుగాను మొత్తంగా 175 నియోజకవర్గాల్ని గెలుచుకునేందుకు వీలు కలుగుతుందన్నది వైఎస్ జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.

ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా వున్నా, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం, ప్రజా ప్రతినిథులపై వున్న వ్యతిరేకత వంటి అంశాలపై తనకు ఇప్పటికే అందిన నివేదికల ఆధారంగా వైఎస్ జగన్, ఈ కీలకమైన ముందడుగు వేస్తున్నారు. ఎక్కడైతే అధికార పార్టీ ప్రజా ప్రతినిథుల మీద తీవ్ర వ్యతిరేకత వుంటుందో, అక్కడ నాయకత్వ మార్పు దిశగానూ వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారట.