సోషల్ మీడియాపై జగన్ ప్రత్యేక దృష్టి…దుమ్ములేచి పోవాల్సిందే

ఇకనుండి సోషల్ మీడియాలో పార్టీ ప్రచారంపై దుమ్ములేచిపోవాల్సిందేనని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయించారు. అందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారట. ఎటూ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో సోషల్ మీడియాకు సంబంధించి మూడంచెల విధానాన్నిఅవలంభించాలని జగన్ స్సష్టమైన ఆదేశాలిచ్చారట. దాని ప్రకారమే మండల స్ధాయి వరకూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా యూత్ కు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారని సమాచారం.

 

పోయిన ఎన్నికల్లో జగన్ చేసిన తప్పుల్లో ఇది కూడా ఒకటి. పోయిన సారి సోషల్ మీడియాలో పార్టీ ప్రచారంపై జగన్ పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో చంద్రబాబునాయుడు సోషల్ మీడియా ప్రచారాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నారు. అసలే మీడియాలో 90 శాతం మద్దతుంది. దానికితోడు సోషల్ మీడియా ప్రచారం కూడా చంద్రబాబుకు బాగా ఉపయోగపడింది. ఆ విషయాన్ని జగన్ గుర్తించేనాటేకే బాగా ఆలస్యం జరిగిపోయింది. అందుకే సోషల్ మీడియా ప్రచారంపై దాదాపు మూడేళ్ళ క్రితం నుండే బాగా దృష్టి పెట్టారు.

 

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే వైసిపి ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసి టిడిపి వెంటపడుతోంది . దాన్ని తట్టుకోలేకే చంద్రబాబు, లోకేష్ వైసిపి తరపున సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారిపై కేసులు పెట్టటం, వేధింపులకు దిగుతోంది. నిజానికి మూడేళ్ళ నుండి సోషల్ మీడియాలో మెజారిటీ ప్రచారం వైసిపికి అనుకూలంగానే ఉంటోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో తెలుగుదేశంపార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్ లను వాయించేస్తున్నారు.

 

ఎప్పటెప్పటి చరిత్రనో తవ్వి తీసి తండ్రి, కొడుకులను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో వేలాది గ్రూపులు వైసిపికి అనుకూలంగా పనిచేస్తుండటం కూడా సానుకూలంగా ఉంది. అందుకే చంద్రబాబు, లోకేష ఉలిక్కిపడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా వైసిపికి అనుకూల ప్రచారంతో పాటు టిడిపి వ్యతిరేక ప్రచారాన్ని మరింత పెంచాలని జగన్ నిర్ణయించారు.

 

అందులో భాగంగానే పార్టీ ప్రచారం కోసం మండల స్దాయిలో బాగా యాక్టివ్ గా ఉండే 15 మందిని ఎంపిక చేసి ప్రచారాన్ని విస్తృతం చేయాలని జగన్ ఆదేశించారు. అందుకు తగ్గట్లే నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రతీ మండలంలోను కమిటిలను వేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సోషల్ మీడియా టిడిపిపై మరింతగా రెచ్చిపోవటం ఖాయంగానే అనిపిస్తోంది.