వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్ప లక్షణాల్లో నమ్మినవారిని కాపాడుకోవడం కూడ ఒకటి. ఇంతవరకు వైసీపీలో జగన్ ను నమ్మి మోసపోయాం అన్న నాయకుడే లేడు. జగన్ నోటి నుండి హామీ వచ్చిందంటే అది జరిగి తీరవలసిందే. అలా ఆయన నుండి మాట తీసుకున్న అనేక మంది నాయకులు ఇప్పుడు మంచి పదవుల్లో ఉన్నారు. మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, కీలక కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. అలాగే పార్టీకి అండగా ఉన్న కుటుంబాలను సైతం జగన్ విడిచిపెట్టరు. ఆ కుటుంబాలకు కష్టం వస్తే తప్పకుండా ఆదుకుంటారు. కాకపోతే ఇక్కడ పొందాల్సిందల్లా ఆయన అభిమానమే.
అలా జగన్ నుండి అమితమైన అభిమానాన్ని పొందిన కుటుంబాల్లో ద్రోణంరాజు ఫ్యామిలీ ఒకటి. ద్రోణంరాజు శ్రీనివాసరావు అంటే ముఖ్యమంత్రికి వల్లమాలిన అభిమానం. అందుకే గత ఎన్నికల్లో ఆయనకు విశాఖ సౌత్ టికెట్ కేటాయించారు. కానీ ఆయన ఓడిపోయారు. ఒకవేళ ఆయన గనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేవారే. ఓడిపోయినా కూడ ఆయన్ను పక్కనబెట్టలేదు జగన్. కీలకమైన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. ద్రోణంరాజు చైర్మన్ పదవిలో తన పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు కూడ.
అయితే వైసీపీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అకాల మరణం చెందారు. ఇది ఆయన అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని కలచివేసింది. ఇప్పుడు ఆయన వారసుడిగా ద్రోణంరాజు శ్రీవాత్సవ్ రాజకీయాల్లోకి రానున్నారట. తండ్రి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులూ ఉద్యోగం చేసుకుంటున్న శ్రీవాత్సవ్ కేడర్ కోసం ఇప్పడు రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఆయన్ను జగన్ తప్పక నిలబెడతారని అంతా అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే టాక్ కూడ ఉంది. శ్రీవాత్సవ్ కు విజయసాయిరెడ్డి నుండి ఇప్పటికే మాట హామీ వెళ్లిపోయిందని కూడ చెప్పుకుంటున్నారు.