అభ్యర్ధులతో జగన్ కీలక సమావేశం

పోలింగ్ జరిగిన ఇన్ని రోజులకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులు, సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈనెల 21వ తేదీన తాడికొండలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో అభ్యర్ధులు, సీనియర్ నేతలతో భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే, ఎన్నికల జరిగిన దగ్గర నుండి జగన్ అభ్యర్ధులతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదు.

పోలింగ్ సరళిపై తనకున్న మార్గాల్లో సమాచారాన్ని తెప్పించుకున్నారే కానీ ఎవరితోను భేటీ కాలేదు. అదే సమయంలో అభ్యర్ధులతో చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు సమావేశాలు పెట్టింది అందరూ చూసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈనెల 19వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలుగు చూస్తున్నాయి. నిజానికి పోలింగ్ పూర్తవ్వగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవ్వటానికి చాలా సంస్ధలు రెడీగా ఉన్నాయి. అయితే ఎన్నికల కమీషన్ నిబంధనల వల్ల ఆగాయంతే.

అంటే 19వ తేదీన వెలుగు చూసే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, కౌంటింగ్ రోజున అనుసరించాల్సిన జాగ్రత్తలను ఓసారి సమీక్షించేందుకే జగన్ కీలక సమావేశం జరుపుతున్నారు. పోలింగ్ ముందుకానీ తర్వాత కానీ కొన్ని సర్వే సంస్ధలు వైసిపిదే అధికారమంటూ హోరెత్తించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

వైసిపిదే అధికారమని ఏవో చిన్నా చితకా సంస్ధలు సర్వేలంటూ ఏదో హడవుడి చేస్తున్నా పేరున్న జాతీయ మీడియా సంస్ధలేవీ ఇంత వరకూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించలేదు. సరే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ప్రతీసారి నిజాలవుతాయా అంటే అది వేరే సంగతి. ఏదేమైనా టిడిపి అభ్యర్ధులేమో ఫలితాల విషయంలో ఒకవైపు ఫుల్లు టెన్షన్ తో ఉంటే వైసిపి నేతలు మాత్రం మంచి జోష్ లో ఉన్నారు.