ఇంత ధీమానా..?.. వైజాగ్ లో తాజా పరిస్థితి ఇదే!

ఏపీలో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతుంది. దాదాపు ప్రతీ ఒక్కరిలోనూ ఫలితాలకు సంబంధించిన టెన్షన్ తీవ్ర స్థాయిలో నెలకొందని అంటున్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే కాస్త రిలీఫ్ అని అంటున్నా.. గత తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాట్ పోల్స్ కి తేడాలు వచ్చాయనే విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారంట. ఈ నేపథ్యంలో జూన్4 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి.

ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎవరి ధీమా వారు ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఇటీవల వారణాసి వెళ్లిన చంద్రబాబు.. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అనేశారు. ఇక 21 కి 21 గెలుస్తున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. మరోపక్క 2019 ఎన్నికల ఫలితాలకంటే ఎక్కువ సీట్లు ఈసారి వైసీపీ గెలుస్తుందని.. ఐప్యాక్ టీం ని కలిసిన సందర్భంగా వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో… వైసీపీ నేతలు ఒక అడుగు ముందుకేసి జూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని స్టేట్ మెంట్ ఇచ్చారు. వారన్నప్పుడు మనం కూడా అనకపోతే బాగోదనో ఏమో కానీ… అదే 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం అని టీడీపీ నేతలు ప్రకటించారు! ఆ సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం వైజాగ్ లో పరిస్థితి వైసీపీ ధీమాకు అద్దం పడుతుందని అంటున్నారు.

అవును… ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనని, ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఫిక్స్ చేసి.. జూన్ 9న వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టడమే కాకుండా… అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగా… వైజాగ్ లో జూన్-9 నాటికి ముందస్తుగా హోటల్ రూమ్ లు కూడా బుక్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో దాదాపుగా రూమ్ లు అన్నీ వైసీపీ నేతలు బ్లాక్ చేసి పెట్టినట్లు చెబుతున్నారు. వీఐపీలు, వీవీఐపీల కోసం స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు కూడా ఆన్ లైన్ వేదికగా విశాఖలో హోటల్ రూమ్ లు బుక్కింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

ఈ రేంజ్ లో వైసీపీ హడావిడి చేస్తుంటే… మరోపక్క టీడీపీలో కలవరం మొదలైందని అంటున్నారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమాగా చెబుతుండే సరికి.. టీడీపీ కూడా పోటీగా అదే డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 9 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలెవరూ సమర్థించకపోవడం, కనీసం మద్దతు తెలపకపోవడం విశేషం!

ఏది ఏమైనా… జూన్ 9కోసం విశాఖలో హోటల్స్ అన్నీ అడ్వాన్స్ బుక్కింగ్ జరుగుతుండటం మాత్రం గొప్ప విషయం అని.. వైసీపీ గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు ఆ స్థాయిలో ధీమాగా ఉండటం చిన్న విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.