వైఎస్ జగన్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడానికి గల ప్రధాన కారణాల్లో ఆయన మీదున్న సానుభూతి కూడ ఒకటి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నానా అవస్థలు పడ్డప్పుడే జగన్ మీద జనంలో సింపతీ స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి లేకపోవడం వలన ఆయన బిడ్డను ఇన్ని కష్టాలు పెడుతున్నారనే అభిప్రాయానికి జనం వెళ్లారు. జగన్ సైతం నాకు అంతా మీరే అంటూ జనానికి చేరువయ్యారు. కాబట్టే 2014 ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. ఇక గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు కలిసి జగన్ ఓడించాయి. ఆయన పార్టీని నామ రూపాల్లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యేలను కొనేశారనే భావన కూడ బలంగా నాటుకుంది.
ఇక జగన్ అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలు అంటూ నోరు తెరిచి అడగడంతో జనం కాదనలేకపోయారు. బంపర్ మెజారిటీ ఇచ్చి ఏంచేస్తావో చూపించు అన్నారు. ఇలా జగన్ పట్ల కేవలం సామాన్య, గ్రామీణ ప్రాంత జనమే కాదు మేధావి వర్గం సైతం సింపతీ చూపించింది. జగన్ సీఎం అయిన మొదట్లో కూడ మేధావి వర్గం జగన్ వైపే ఉంది. ఆయన తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వారికి బాగా నచ్చింది. సంక్షేమ పథకాలు ఆటంకాలు లేకుండా జనానికి అందటాన్ని వాళ్ళు మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత కొన్ని నెలలుగా మేధావి వర్గం జగన్ పట్ల నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తోంది.
మేధావి వర్గం పేదల గురించే కాకుండా మధ్యతరగతి ప్రజల గురించి కూడ ఆలోచిస్తుంది. జగన్ పాలనలో పేదలకే అమితమైన లబ్ది అందుతోంది తప్ప మధ్యతరగతి వారికి ఏమీ జరగట్లేదు. సగానికి పైగా సంక్షేమ పథకాలకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు 80 శాతం మంది అర్హులు కారు. వారంతా అభివృద్ధి మీద అస్లు పెట్టుకుంటారు. అభివృద్ధి జరిగితే ఉపాధి దోరుకుంటుందనేది వారి ఆశ. కానీ అభివృద్ధి అంతగా జరగట్లేదు. అందుకే మేధావి వర్గం జగన్ పక్షాన్ని వీడి విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అయినా జగన్ ఏమీ పెద్దగా ఫీలవ్వట్లేదట. మేధావి వర్గాల మెప్పు కంటే పేద ప్రజల ఆశీస్సులే కావాల్సింది, మన పాలనలో సంక్షేమ ఫలాలు అందుకుంటూ పేదలు సంతోషంగా ఉన్నారు కదా అంటూ ధైర్యంగా ఉన్నారట.