టీడీపీ నుండి వైసీపీకి జైకొట్టిన ఎమ్మెల్యేల్లో కరణం బలరాం ఒకరు. ప్రకాశం జిల్లాల్లో బలమైన రాజకీయ నేతగా ఉన్న ఈయనకు కేవలం చీరాలలోనే కాదు అద్దంకిలో కూడ మంచి పట్టుంది. ఎక్కడినుంచైనా పోటీచేసి గెలవగల సామర్థ్యం ఉన్న నేత. కానీ అధికారం లేని పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేరు. పవర్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. ఆ అలవాటు మేరకే ఒదిన టీడీపీని వదిలి వైసీపీకి మద్దతుపలికారు. అప్పటి నుండి చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి బలరాం వర్గానికి విబేధాలు మోయాలయ్యాయి. సాధారణంగా అయితే కరణం లాంటి లీడర్ ముందు వేరొకరు నిలవకపోదురు. కానీ ఆమంచి మాత్రం నిలబడ్డారు. చీరాలను పూర్తిగా తన ఆధిపత్యంలోనే పెట్టుకోవాలన్న కరణం ఆశలకు అడుగా నిలిచి ఉనికిని చాటుకున్నారు.
కరణం కేవలం చీరాలలోనే కాదు అద్దంకిలో కూడ పైచేయి సాధించాలని చూస్తున్నారు. పక్కా వ్యూహం ప్రకారం కుమారుడ్ని తనకంటే ముందే వైసీపీలో చేర్చి వచ్చే ఎన్నికల్లో అద్దంకి టికెట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. తాను చీరాలలో ఉంటూ కుమారుడ్ని అద్దంకిలో ఉంచి జిల్లా రాజకీయాల్లో జెండా ఎగరేయాలని అనుకున్నారు. పార్టీ మారి ఇలా రెండు చోట్ల చక్రం తిప్పాలనుకున్న కరణం వ్యూహం వైసీపీ పెద్దలకు కూడ నచ్చలేదు. అందుకే ఆమంచికి సపోర్ట్ ఇచ్చారు. జగన్ దగ్గర కూడ ఆమంచిని వెనకేసుకొచ్చారు. ఫలితంగా జగన్ చీరాలను ఆమంచికే ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే వచ్చే ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ ఆమంచికే అనుకోవచ్చు.
ఇక కరణం విషయానికి వస్తే అద్దంకి టికెట్ ఆఫర్ చేసేలా ఉన్నారు. తను లేదా తన కుమారుడు ఎవరో ఒకరికే అవకాశం ఉంటుందని, అది అద్దంకి నుండే ఉంటుందని సంకేతాలు పంపుతున్నారట. దీన్నిబట్టి కరణం దూకుడుకు చెక్ పెట్టే రోజులు త్వరలోనే రానున్నాయని చెప్పుకుంటున్నాయి ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాలు. ఇప్పటికే హైకమాండ్ నుండి ఆమంచికి రావాల్సిన హామీ వచ్చేసిందని కూడ చెప్పుకుంటున్నారు. మొత్తానికి పార్టీ మారినా పైచేయి తనదేనని, రెండు చోట్ల రాజకీయం చేయాలని అనుకున్న బలరాంకు గట్టి షాక్ తగిలింది. ఈ ఆఫర్ కు ఒప్పుకుంటే ఆయన పార్టీలో ఉంటారు. అలా కాదని ఇంకా ఆమంచి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అద్దంకి ఆఫర్ కూడ చేజారిపోవచ్చు.