వైఎస్ జగన్ కు 2019 ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఉంది. ఈ జిల్లా పరిధిలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇలాంటి జిల్లాలో కొన్నాళ్ళుగా పార్టీ కీలక నేతల మధ్యన సయోధ్య తప్పిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు మెల్లగా తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది. జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని ఆనం భావిస్తున్నారు. జిల్లా మంత్రులు తన నియోజకవర్గంలో తన నోటీసుకు వెళ్లకుండానే కలుగజేసుకుంటుండటం ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ప్రధానంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ కుటుంబం మీద ఆధిపత్యం చేస్తున్నారని రామనారాయణరెడ్డి భావిస్తున్నారు.
అందుకే వచ్చే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు ఇవ్వాలని అధిష్టానం ముందు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందుకుగాను తిరుపతి ఉపఎన్నికలను ఆసరాగా చేసుకోవాలని అనుకున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వెంకటగిరి కూడ ఒకటి. ఉప ఎన్నికల దగ్గరపడితే జగన్ తప్పకుండా తిరుపతి లోక సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతారు. అప్పుడు తన వాయిస్ గట్టిగా వినిపించాలని ఆనం భావిస్తున్నారట. ఆమేరకు సన్నాహకాలు కూడ చేసుకున్నారు. ఇంతవరకు తన కేడర్ నుండి ఉప ఎన్నికల కోసం ఎలాంటి ఏర్పాట్లను జరగనివ్వలేదు. అసలు వెంకటగిరిలో ఉప ఎన్నికల హడావుడీ కనిపించట్లేదు. ఈ పరిస్థితి మొత్తాన్ని జగన్ గమనిస్తూనే ఉన్నారు.
అసలే ఆయన ఉప ఎన్నికల హడావుడిలో ఉన్నారు. పైకి కనబడకపోయినా ముమ్మరంగా చిత్తూరు జిల్లా నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని చూస్తున్నారు. అన్ని అసెంబ్లీల్లోని పరిస్థితుల మీద సమీక్ష చేసుకుంటున్నారు. ఆయన సమీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గం ఒక్కటే తేడాగా అకనిపించిందట. ఆరా తీస్తే ఆనం అసంతృప్తితో ఉన్న సంగతి బయటపడింది. ఇదివరకు కూడ ఆనం ప్రాధాన్యత విషయమై జగన్ కు తెలిసేలా వాయిస్ వినిపించారు. అప్పుడు నచ్చజెప్పి ఊరుకుండబెట్టారు. కానీ ఇప్పుడు అలా నచ్చజెబితే పని జరగదని అనుకున్నారో ఏమో కానీ గట్టిగానే ఆనం మీద ఒత్తిడి తెచ్చారట. దీంతో ఆనం దారిలోకి రాక తప్పలేదు. ఉన్నట్టుండి ఆయనలో పెను మార్పు వచ్చేసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఆనం కుటుంబీకుల మార్క్ చూపిస్తామని అన్నారు. ఆనం దారిలోకి రావడంతో ఉప ఎన్నికల్లో ఉన్న ఒక్క చిక్కూ తీరిపోయినట్టైంది.