మొన్నామధ్యన విడుదలై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ నందు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటంతో అందరం చంకలు గుద్దుకున్నాం. రాజధాని లేకపోయినా వ్యాపారాలకు అనుకూల సంస్కరణలు మన దగ్గరే ఉన్నాయ్ అంటూ గప్పాలు కొట్టుకున్నాం. కానీ తాజాగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దేశంలోని అక్షరాస్యత వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 66.4 శాతం అక్షరాస్యతతో ఆఖరి స్థానంలో ఉందనే చేదు నిజం వెల్లడైంది. ఇది నిజంగా తలదించుకోవాల్సిన, గుండెలు బాదుకోవాల్సిన విషయం. జూలై 2017 నుండి జూన్ 2018 వరకు ఏడేళ్ళు, ఆపైబడిన వయసున్న వారిపై సర్వే జరిపి ఈ లెక్కలు విడుదల చేశారు.
విచిత్రం ఏమిటంటే 70.9 శాతం అక్షరాస్యతతో బీహార్ రాష్ట్రం మనకంటే ముందుంది. జాతీయ అక్షరాస్యత రేటు సగటు 77.7 శాతం ఉండగా ఏపీ దానికి చాలా దూరంలో ఉంది. మనకంటే తెలంగాణ కొంచెం మెరుగ్గా ఉంది. అక్కడ అక్షరాస్యత రేటు 72.8 శాతం ఉంది. కానీ మనమే అటడుగున ఉన్నాం. ఈ లెక్కలు చూస్తే మన విద్యా విధానంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఈ లెక్కలు తీసింది చంద్రబాబు హయాం నడుస్తున్నప్పుడే. అంటే చంద్రబాబు సర్కార్ అవలంభించిన పద్దతులేవీ మన విద్యా వ్యవస్థను మెరుగుపరచలేకపోయాయని పక్కాగా నిరూపితమైంది.
చంద్రబాబు గారు తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. వందల సర్కార్ బడులు ఆయన పాలనలోనే మూతబడ్డాయి. ప్రైవేట్ విద్యా రంగం ఆధిపత్యాన్ని చలాయించింది. ఫలితంగా పేదవాడు చదువుకు దూరమయ్యాడు. అందుకే ఈనాడు చివరి స్థానంలో నిలబడి తలవంచుకున్నాం. ఇక ఆడవారిలో అక్షరాస్యత రేటు సైతం మన దగ్గర తక్కువే. మగవారితో పోల్చితే ఆడవారి అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. మరి నిన్నంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రెడిట్ మాదే మాదేనంటూ గొప్పలకు పోయిన టీడీపీ ఈ నిరక్షరాస్యతకు బాధ్యత వహిస్తుందా. ఆరు నూరైనా నూరు నూటయాభై అయినా వహించదు.
చంద్రబాబు తన కార్పొరేట్ బుర్రతో కార్పొరేట్ స్కూళ్లను వెనకేసుకొచ్చారు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించే కృషి చేయానేలేదు. ఆయన చేసిన ఈ డ్యామేజ్ కు ప్రజెంట్ సీఎం వైఎస్ జగనే రిపేర్లు చేయాలి. ఎలాగూ నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న జగన్ అమ్మ ఒడి లాంటి పథకాలనూ నడుపుతున్నారు. అలాగే నిర్భంధ విద్యా విధానాన్ని కూడా కఠినంగా అమలు చేసి పిల్లలను బదుల వైపుకు మళ్లించాలి. ముఖ్యంగా పల్లెల్లో అక్షరాస్యత శాతం పెరిగే మార్గాలు అన్వేషించాలి. అప్పుడే అక్షరాస్యత శాతం పెరిగి అభివృద్దికి కొత్త బాటలు పడుతాయి.