ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పటికే తాను తీసుకున్న ప్రతి నిర్ణయంపై కోర్ట్ లలో కేసులు నమోదు అవుతున్నప్పటి తన పరిపాలన ధోరణిని మార్చుకోవడం లేదు. అలాగే కేసులకు భయపడి తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం లేదు. తన నిర్ణయాలు కరెక్ట్ అని కోర్ట్ లలో వాదిస్తున్నారు . అయితే ఇప్పుడు ఒక నిర్ణయంపై జగన్ ప్రధాని మోడీ చెప్పిన దానికి తల ఊపాల్సి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఆంధ్రలో తెలుగు మీడియంను రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలని పట్టుబట్టింది. ఇది ప్రాధమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టుల్లో కేసులు పడ్డాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అనేక మంది న్యాయపోరాటం చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ రెండు మీడియంలలో చదువులు చెబితే.. విద్యార్థులు ఎందులో చేరాలనుకుంటే అందులో చేరుతారని సూచనలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్య విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ విధానాన్నే ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చేయాలని .. విద్యా విధానాన్ని 5+3+3+4 విధానం పద్దతిలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తాను తీసుకున్న నిర్ణయాల అమలుపై కఠినంగా వ్యవహరించే జగన్ ఇప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పక అమలు చేయాల్సి వచ్చింది. మోదీ ప్రవేశ పెట్టిన విధానాన్ని ఏపీ అమలు చేయడంతో కోర్ట్ లో కేసులు వేసిన వారు సంతోషిస్తున్నారు.