అసెంబ్లీలో బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్… డైలాగులు లేని ఆర్టిస్టులా పవన్!?

“దగా దగా మోసం… నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు”… ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని పాటలో కొన్ని లైన్లు! ప్రస్తుతం ఏపీలో ప్రజానికం ఈ తరహా పాటలే పాడుకుంటున్నారని అంటున్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీలను అత్యంత బలంగా నమ్మి, పక్కనున్న పవన్ ని నమ్మి ఓట్లు వేసినవారు లోలోపల కుమిలిపోతున్నట్లు చెబుతున్నారు.

దీనికి ఓ బలమైన కారణం ఉంది. నిన్నమొన్నటి వరకూ తల్లికి వందన, మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 20,000 సాయం, 18ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 15,00, నిరుద్యోగ భృతి 3,000 వంటి సూపర్ సిక్స్ హామీలపై కూటమి మంత్రులు నిన్నమొన్నటివరకూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ చంద్రబాబు ఓపెన్ అయిపోయారు.

తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు… ప్రజలకు ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలను ఇచ్చామని.. అవి సూపర్ సిక్స్ హామీలు అని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే భయంగా ఉందని.. ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొందని.. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు.

అంటే సూపర్ సిక్స్ హామీలు ప్రస్తుతానికి అమలు చేయలేకపోతున్నామని చెప్పకనే చెబుతున్నారన్నమాట! ప్రస్తుతం ఇదే చర్చ రాష్ట్రవ్యాప్తంగా.. ప్రధానంగా కూటమి ఓటు వేసిన వారి మధ్య బలంగా నడుస్తుంది! కూటమి ఓటు వేసినవారి మధ్యే ఎందుకంటే… వైసీపీకి ఓటు వేసిన వారికి బాబు ఇచ్చే హామీలు.. ఎన్నికలయ్యాక బోడి మల్లన్న కబుర్లు తెలిసి ఉండటం వల్ల అయ్యిం ఉంటుందని అంటున్నారు.

మరోపక్క ఏపీలో అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు జగన్. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన… చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించారు.. నిలదీశారు. అయిదేళ్ల పాటు హామీలు అమలు చేయాల్సిందే అని అన్నారు. ఈ సమయంలో జగన్ ఉండి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఇప్పటికే హామీలు అమలయ్యేవని జనం అనుకుంటున్నారని అన్నారు.

అయితే… చంద్రబాబు మాత్రం సెంటిమెంట్ డైలాగులు కొడుతూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం… డైలాగులు లేని జూనియర్ ఆర్టిస్ట్ మాదిరి అలా ఉండిపోయారని అంటున్నారు. పైగా ఆయన ప్రవర్తన… కూటమి ఇచ్చిన హామీలతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా ఉందని.. నేడు చంద్రబాబు చేస్తున్న పాపాలు, ప్రజలకు పొడుస్తున్న ప్రతీ వెన్నుపోటులోనూ ఆయనకు వాటా ఉంటుందని గుర్తుచేస్తున్నారు ప్రజానికం.

ఈ నేపథ్యంలో… ప్రస్తుతానికి రైతులు, మహిళలు, తల్లులు, నిరుద్యోగులు మొదలైన వారు కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్ ఇచ్చిన పథకాలకంటే రెట్టింపు ఇవ్వబోతోంది, చంద్రబాబు మోసం చేయాలనుకున్నా పవన్ అన్న గట్టిగా ప్రజల తరుపున నిలబడి ఇప్పించబోతున్నారు వంటి ఆశలు పెట్టుకోవద్దని, అలాంటి భ్రమల్లో బ్రతకొద్దని సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!