ప్రధాని మోడీ ముందర.. వైఎస్ జగన్ చేతులు జోడించి మరీ.!

చేతులు జోడించి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీలు ప్లాంటు తదితర అంశాలపై విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభ నుంచే వర్చువల్ విధానంలో ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నత వ్యక్తిత్వం కలవారంటూ కొనియాడారు ప్రధాని. రాష్ట్రానికి కేంద్రం పలు విధాల మేలు చేస్తోందనీ చెప్పుకున్నారు. ఇంకోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్ర సమస్యల్ని ఏకరువు పెట్టారు. ఎనిమిదేళ్ళ క్రితం తగిలిన విభజన గాయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదనీ చెప్పారు.

అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని కూడా వైఎస్ జగన్ చెప్పడం గమనార్హం. పలు సందర్భాల్లో విభజన సమస్యలపై కేంద్రానికి విజ్ఞప్తి చేశామనీ, పెద్ద మనసుతో వాటిని పరిష్కరించాలనీ వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మీ ఆశీస్సులు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రెండు చేతులతోనూ నమస్కరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా సహా పలు అంశాల్ని వైఎస్ జగన్ ప్రసంగంలో ప్రస్తావించడం గమనార్హం. ప్రత్యేక హోదాకి ఎప్పుడో పాతరేసింది బీజేపీ. పోలవరం ప్రాజెక్టునీ ముందుకు కదలనీయడంలేదు. రైల్వే జోన్ వ్యవహారాన్నీ తేల్చడంలేదు. అయినాగానీ, ‘రాజకీయాలకతీతంగా మీతో అనుబంధం కొనసాగుతోంది..’ అని వైఎస్ జగన్, ప్రధానితో చెప్పడం విశేషం.