మోదీ రాజకీయ వ్యూహాలు సామాన్యంగా ఉండవు. ఆయన ముందు జాతీయ పార్టీల లీడర్లే దిగడుపు అయిపోతుంటారు. ఇక ప్రాంతీయ పార్టీలను అయితే మోదీ కరివేపాకులా చూస్తుంటారు. అవసరమైనంతసేపు తెగ పొగిడేసి అవసరం తీరాక అవతల పెట్టేస్తుంటారు. అందుకే ఎన్డీయే కూటమి నుండి చిన్న చిన్న పార్టీలు వైదొలగే పనిలో ఉన్నాయి. ఇదే ఫార్ములాను జగన్ విషయంలో కూడ ఫాలో అయ్యారు ఆయన. జగన్ భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పట్ల కొంత ఆదరణ చూపి బుట్టలో వేసుకున్నారు. జగన్ కూడ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికో పెట్టుకుని మోదీతో సౌమ్యంగా ఉంటూ వచ్చారు. మంచితనంతోనే ప్రత్యేక హోదా రాబట్టుకోవాలని చూశారు.
కానీ కేంద్రం మాత్రం లొంగట్లేదు. అదిగో ఇదిగో అంటుందే తప్ప హోదా విషయంలో ఎటూ తేల్చదు. సరే పోనీ ప్రత్యేక ప్యాకేజీ కింద అయినా సకాంలో నిధులు విడుదల చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇక్కడేమో జగన్ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ మీద అనేక విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో హోదా తీసుకొచ్చి తీరుతామని ప్రమాణాలు చేశారు. అందుకే కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించాలని చాలా ప్రయత్నాలే చేశారు. సఖ్యతతో ఉంటూ వీలు కుదిరినప్పుడల్లా మోదీ, అమిత్ షాల వద్ద హోదా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం దిగిరావట్లేదు. ఇక్కడేమో జగన్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది. బీజేపీతో రాజీపడిపోయారనే ఆరోపణలు మీద పడుతున్నాయి.
అందుకే జగన్ కేంద్రాన్ని లౌక్యంగా లాక్ చేయాలని డిసైడ్ అయ్యారు. త్వరలో కేంద్రం అంతర్రాష్ట్ర సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అందరి ముందు మోదీ ప్రత్యేక హోదా మీద ఆయన ఇచ్చిన మాటను ప్రస్తావించి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని సవినయంగా కోరితే అందరి సమక్షంలో ఉంటారు కాబట్టి మర్యాద కోసమైనా తప్పకుండా ఆయన అంగీకరిస్తారని జగన్ ఆలోచనట. పనిలో పనిగా పోలవరం విషయంలో కూడ విభజన హామీలను నెరవేర్చమని అడగాలని అనుకుంటున్నారట. జగన్ ప్లాన్ నిజంగా మంచిదే. పెద్దలను నలుగురి సమక్షంలో ఉన్నప్పుడు మాట నిలబెట్టుకోమని అడిగితే సభా మర్యాద కోసమైనా ఒప్పుకుంటారనేది జగన్ వ్యూహం. మొత్తానికి జగన్ కర్ర విరగకుండా పాము చావడం అనే ఫార్ములాను ప్రయోగించారన్నమాట.