అర్ధాంతరంగా ఆగిపోయిన జనసంకల్పయాత్రను వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీ తర్వాతే మొదలుపెట్టనున్నారు. ఎడమభుజానికైన లోతైన గాయం మాననకపోవటం వల్లే పాదయాత్రను వాయిదా వేయాల్సొచ్చింది. నిజానికి శుక్రవారం నుండి కానీ లేదా సోమవారం నుండికానీ పాదయాత్రను మళ్ళీ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే డాక్టర్లు అభ్యంతరం చెప్పారు. అయినా సరే పాదయాత్ర మొదలవ్వాల్సిందేనంటూ 3వ తేదీ నుండి పాదయాత్ర మొదలవుతుందని పార్టీ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.
అయితే, శుక్రవారం జగన్ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు మరో మూడు వారాలపాటు విశ్రాంతి అవసమని తేల్చారు. ఎందుకంటే ఎడమభుజానికైన కండరం గాయం మానలేదన్నారు. చేయి కదిలినపుడల్లా నొప్పిగా ఉందని జగన్ చెప్పటం వల్లే వైద్యులు ఆ నిర్ణయం తీసుకున్నారు. మునుపటిలాగ చెయ్యి ఫ్రీగా కదలాలంటే కండరానికైన గాయం మానాలని డాక్టర్లు తేల్చిచెప్పారు. అది మాననంత వరకూ చెయ్యి కదిపేందుకు లేదన్నారు. అదే సమయంలో పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళినపుడు అభిమానుల తాకిడి తట్టుకోవటం కూడా కష్టమని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
మామూలుగానే జగన్ చూడటానికి విపరీతంగా జనాలు వస్తున్నారు. అటువంటిది రేపేదైనా జరగరానిది జరిగితే సమస్య మరింత పెరిగిపోతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాదయాత్ర సందర్భంగా గాయానికి ఇన్ఫెక్షన్ సోకితే దాన్ని మాన్పేందుకు నానా అవస్తలు పడాల్సుంటుందని డాక్టర్లు హెచ్చరించారు. గాయం తాలూకు నొప్పి తగ్గకపోవటం, డాక్టర్లు కూడా తీవ్రంగా హెచ్చరించటంతో చేసేదిలేక కనీసం 10 రోజులు వాయిదా వేసుకున్నారు. అదే విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 15వ తేదీ తర్వాత పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.