నో మొహమాటమ్స్… మళ్లీ మార్పులు మొదలుపెట్టిన జగన్!

గతంలో ఎన్నడూ లేనంతగా.. కనీవినీ ఎరుగని రీతిలో అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి సుమారు 99 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు చేపట్టారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ క్రమంలో మూడు స్థానాలు మినహా ఎంపీ అభ్యర్థులందరినీ మార్చగా… 75స్థానాలకు పైబడి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టారు! ఈ సమయంలో మరోమారు మార్పుల ప్రక్రియ చోటు చేసుకోవడం గమనార్హం.

అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుమారు ఆరు నెలల ముందు నుంచీ అభ్యర్థుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పులివెందులలోని వైఎస్సార్ ఘాట్ వేదికగా 175 అసెంబ్లీ, 24 లోక్ సభ (అనకాపల్లి మినహా) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇదే సమయంలో పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లతో పాటు పరిశీలకులను నియమించారు.

వీరిలో ఇన్ ఛార్జ్ అనే వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండగా.. పరిశీలకుడిగా బాధ్యతలు అందుకున్న వ్యక్తి.. అభ్యర్థి గెలుపుకు సహకరించాలి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవ్వడంతో.. ఇక ఈ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకుల విషయంలో ఇకపై మార్పులు, చేర్పులు ఉండవని అంటున్న తరుణంంలో… మరో మార్పుకు శ్రీకారం చూట్టారు జగన్. మార్పులు, చేర్పుల విషయంలో తగ్గేదేలేదని చెప్పకనే చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… మైలవరం నియోజకవర్గంలో టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సమయంలో అధికార వైసీపీ నుంచి సర్నాల తిరుపతి రావు యాదవ్ బరిలో దిగుతున్నారు. మరోపక్క ఈ నియోజకవర్గానికి పరిశీలకుడిగా అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. అయితే అసలు అభ్యర్థిని పక్కకు పెట్టి మరీ కిరణ్ కుమార్ రెడ్డి హల్ చల్ చేస్తున్నారని జగన్ దృష్టికి విషయం చేరిందంట.

ఆరోపణలు వినిపించినా, అభ్యంతరాలు తెరపైకి వచ్చినా చివరి నిమిషంలో కూడా తప్పించడానికి ఏమాత్రం మొహమాటపడే ప్రసక్తే లేదని జగన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారని అంటున్న నేపథ్యంలో… కిరణ్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టారు జగన్! ఆ స్థానంలో కర్రా హర్షా రెడ్డిని నియమించారు! దీంతో… మిగిలినవారు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలు పంపినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.