అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే చంద్రబాబునాయుడుపై జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన చర్చలో చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ’ మీరు సిఎంగా ఉన్నపుడు గాడిదలు కాస్తున్నారా’ ? అంటూ చేసిన వ్యాఖ్యలు గందరగోళంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్ళటాన్ని టిడిపి తప్పుపట్టింది. దానికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సఖ్యత కోసమే, సిఎంల మధ్య సఖ్యత కోసమే తాను హాజరైనట్లు చెప్పారు. గొడవలు పడి కోర్టుల్లో కేసులు వేసుకున్నంత మాత్రాన ఏమీ జరగదన్నారు.
ఈ విషయాలు చెబుతునే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆరభించినపుడు సిఎంగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ నిలదీశారు. కాళేశ్వరం గురించే కాకుండా కర్నాటకలో ఆల్మట్టి, మహారాష్ట్రలో బాబ్లి ప్రాజెక్టులు కూడా గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడే ప్రారంభించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.
చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలతో టిడిపి సభ్యులు గందరగోళం మొదలుపెట్టారు. తమ నేతను గాడిద అంటారా అంటూ అచ్చెన్నాయుడు మండిపోయారు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ అంటే చంద్రబాబును గాడిద అన్నారంటూ అచ్చెన్న కేకలు వేయటం విచిత్రంగా ఉంది.