ముహూర్తం ఫిక్స్… కుప్పంలో జగన్ మాస్టర్ స్ట్రోక్!

నిన్నటి వరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్లుగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ “సిద్ధం” సభలు మొదలుపెట్టినప్పటి నుంచీ పరిస్థితులు మారిపోయాయి. ఆ సభలకు తరలివస్తున్న అశేష జనవాహిని ప్రత్యర్థుల గుండెల్లో కొత్త గుబులు రేపుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకూ భీమిలి, ఏలూరు, రాప్తాడు ప్రాంతాల్లో నిర్వహించిన సభలు ఒకదానికి మించి ఒకటన్నట్లుగా సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుప్పంలో ఒక సభ ప్లాన్ చేశారు జగన్.

అవును… సిద్ధం సభలతో హోరెత్తిస్తున్న జగన్, ఆ పేరున కాకపోయినా ఒక భారీ బహిరంగ సభను నేరుగా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్లాన్ చేశారు. దీంతో ఇది డైరెక్ట్ అటాక్ అని కొందరంటుంటే… బిగ్ స్ట్రోక్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పైగా ఇది ఎన్నికల ప్రచార సభ మాత్రమే కాకుండా… ఒక బృహత్తర కార్యక్రమానికి సంబంధించింది కావడంతో దీనిపై ఆసక్తి మరింత పెరుగుతుంది.

వివరాళ్లోకి వెళ్తే… ఈనెల 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పెద్ద సభ కూడా ఏర్పాటుచేశారు. కారణం ఏమిటంటే… కుప్పం నియోజకవర్గంలో హంద్రీ-నీవా జలాలను 26వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయబోతున్నారు. దీనివల్ల ఈ నియోజకవర్గంలో సుమారు 6,300 ఎకరాలకు సాగునీరుతో పాటు కుప్పం – పలమనేరు నియోజకవర్గాల్లోని సుమారు 2 లక్షల మందికి తాగునీరు అందబోతోంది.

దీంతో… దశాబ్దాలుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయని పనులను జగన్ ఈ ఐదేళ్ళల్లోనే చేసి చూపించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసిన జగన్… కుప్పం కేంద్రంగా రెవెన్యు డివిజన్ ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు, డ్రైనేజి వ్యవస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హంద్రీ-నీవా జలాలను విడుదల చేస్తున్నారు.

అంటే ఒక్క మాటలో చెప్పాలంటే… 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయని పనులను జగన్ ఐదేళ్ళల్లోనే చేసి చూపించారన్నమాట. ప్రస్తుతం కుప్పంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి.. చంద్రబాబు తలచుకుని ఉంటే ఇవేమంత కష్టమైన పనులు కాదు.. కాకపోతే మనసుపెట్టలేదో, మనసు రాలేదో కానీ.. కుప్పాన్ని అలానే ఉంచేశారు చంద్రబాబు. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు జగన్.

అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే… అదే రోజు బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే కుప్పం, హిందుపురం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నరేంద్రమోడీ వర్చువల్ విధానంలో పనులను ప్రారంభించబోతున్నారు. ఈ సమయంలో… తన కృషివల్లే కుప్పం, హిందుపురం రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోందని జగన్ చెప్పుకోకపోయినా.. వాస్తవం అనే అనే విషయం కుప్పం, హిందూపురం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా గ్రహిస్తారనేది వాస్తవం!

మరి ఈ లెక్కన చూసుకుంటే… ఈ నెల 26న కుప్పంలో ఏమి జరగబోతుంది.. ఎలా జరగబోతుంది.. ప్రజానికం ఏస్థాయిలో హాజరుకాబోతుంది.. హంద్రీ-నీవా జలాలను తమ ఊరికి తీసుకురావడంపై కుప్పం ప్రజానికం ఏస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తారు అనేది వేచి చూడాలి!