కూలిపోనున్న చంద్రబాబు కలల కోట

చంద్రబాబునాయుడు ఎంతో మక్కువతో నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేయమంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేయాలంటూ స్పష్టంగా చెప్పారు. ప్రజావేదికపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు మరో అక్రమ కట్టడమైన ప్రజావేదికను తన వాడకానికే కేటాయించాలంటూ లేఖ రాయటంతో వివాదం మరింత పెరిగిపోయింది. చంద్రబాబు లేఖకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

అందుకు అనుగుణంగానే అందులోని తెలుగుదేశంపార్టీ మెటీరియల్ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. దాంతో ఈ విషయాన్ని టిడిపి నేతలు బాగా రాద్దాంతం చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. అక్రమ కట్టడమంటూనే ఇందులో జగన్ కలెక్టర్ల సమావేశం ఎలా పెడతారంటూ పెద్ద లాజిక్ కూడా లేవదీశారు.

అలాంటి ప్రశ్నలకు సమాధానంగానే జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ కట్టడాల్ని ఎలా ప్రోత్సహించారో అందరికీ ఉదాహరణగా చూపించేందుకే ప్రజావేదికలో సమావేశాన్ని పెట్టినట్లు చెప్పారు.  మంగళవారం సమావేశం తర్వాత ప్రజావేదికను కూలగొట్టేయాలంటూ జగన్ సమావేశం నుండే అధికారులకు ఆదేశాలివ్వటం సంచలనంగా మారింది. మొత్తానికి ప్రజావేదికపై చంద్రబాబుకు జగన్ పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక మిగిలింది చంద్రబాబుంటున్న రెండో అక్రమ నిర్మాణమే.