ఎంత కాదనుకున్నా మన రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయన్నది ఒప్పుకోవాల్సిన నిజం. తండ్రి, మామ పేర్లను చెప్పుకుని ప్రధాన నాయకులు ఇద్దరూ అధికారం చెజెక్కించుకున్నారు. అలా చేయడం కరెక్టా కాదా అనేది పక్కనబెడితే అసలు వారసత్వాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దివంగత నాయకుల అసలైన వారసులు విజయవంతమయ్యారా, అయితే ఎవరు అయ్యారు అనే ఆసక్తికర విషయాన్ని ఒక్కసారి చర్చించుకుని తీరవలసిందే. మన రాష్ట్రంలో ఈ తరాలుకు తెలిసిన పెద్ద రాజకీయ నేతలు ఇద్దరే. వాళ్లే నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇద్దరూ పొలిటికల్ పార్టీల పరంగా భిన్న ధ్రువాలే అయినా చరీష్మా పరంగా, పాలనలో నిర్ణయాలు తీసుకునే పద్దతిలో, ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకురావడంలో ఇద్దరూ గొప్పవారే. అందుకే తెలుగు రాజకీయాల్లో వీరి స్థానం సుస్థిరం. ముందే చెప్పుకున్నట్టు వీరికి వారసులున్నారు. ఇప్పుడు ఆ వారసులు ఏ స్థాయిలో తమ పెద్దలు వేసిన రాజకీయ బాటను తమ సొంతం చేసుకున్నారో చూద్దాం.
చంద్రబాబు ముందు తేలిపోయారు :
ముందుగా తెలుగు జాతి ఆట్మగౌరవాన్ని దేశానికి చాటిన నేత ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు ప్రజలమైన మనకు ఉత్తరాదిలో మదరాసీలమనే పేరుండేది. ఆ భ్రమను తొలగించి తెలుగు ప్రజలు తెలుగు ప్రజలేననే గుర్తింపు తీసుకొచ్చారు ఎన్టీఆర్. టీడీపీ పేరుతో పార్టీ పెట్టి తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించి యేడాది లోపే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అలా తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికే ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ పెద్దవారు. ఎన్నికల ప్రచారంలో కూడ పాల్గొన్నారు. బాలకృష్ణ అంత యాక్టివ్ కాకపోయినా హరికృష్ణ ఫుల్ టైమ్ తండ్రితోనే ఉన్నారు.
మధ్యలో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ప్రవేశించక ముందువరకూ హరికృష్ణే పార్టీలో నెంబర్ 2. మరొక అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఉన్నా హరికృష్ణ చుట్టూనే సెకండరీ సైన్యం ఉండేది. కానీ చంద్రబాబు ప్రవేశంతో సీన్ రివర్స్ అయింది. రామారావుగారికి ఆయన పుత్రులకు దూరం పెరిగింది. హరికృష్ణ ప్రమాదాన్ని పసిగట్టి జాగ్రత్తపడినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబు ఎత్తుగడల ముందు ఎన్టీఆర్ అంతటివారే నిలవలేకపోయారు. ఇక ఆయన కుమారులెంత అన్నట్టు బాబు ఆడిన ఆటలో బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ బొమ్మలయ్యారు. చూస్తుండగానే పార్టీ బాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం, బైఎలక్షన్లకు వెళ్లడం, గెలవడం, 89లో ఓడటం, 94లో మళ్ళీ గెలవడం, ఆతర్వాత జరిగిన క్యాంప్ రాజకీయాల్లో బాబు సీఎం అవడం, 1996లో ఎన్టీఆర్ మరణించడం ఇలా వారసులు చూస్తుండగానే అన్నీ జరిగిపోయాయి.
అంతా అయిపోయాక హరికృష్ణ బయటికొచ్చి కొత్త పార్టీ పెట్టి ఏదో ప్రయత్నం చేసినా ఏం ఫలితం లేకపోయింది. చివరకు ఆయన కూడ మళ్లీ టీడీపీ గూటికే చేరి కొన్నాళ్లకు పార్టీ నుండి రాజకీయాల నుండి సైడైపోయారు. ఇక బాలక్రిష్ణ పార్టీలో ఉన్నా పార్టీ మాదే కానీ పెత్తనం, వారసత్వం అంతా వియ్యంకుడిదే అన్నట్టు ఉంటారు. ఇలా రెండవ తరం పూర్తిగా చంద్రబాబుకు లొంగిపోయారు. వారసత్వాన్ని చేజేతులా వదులుకున్నారు. ఇక మూడవ తరం వారసుడు జూ.ఎన్టీఆర్ అయినా పార్టీ పగ్గాలు అందుకునే వీలుందా అంటే కష్టమే. ఎందుకంటే ఎన్టీఆర్ మూడవ తరం రెడీ అయ్యేలోపే బాబు తన రెండో తరం వారసుడిగా లోకేష్ బాబును దింపేశారు. రేపటి రోజున పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా లోకేష్ చేతిలోకే వెళుతుంది తప్ప నందమూరి వారసులకు దక్కదనేది ఎవరు ఒపుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం.
వారసుడంటే జగనే అనేలా:
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఆయన కుమారుడు జగన్ బయటికొచ్చి తండ్రి పేరు వినబడేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు. నిజంగా ఆయన అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి కానీ ఆయన కష్టాల వెనుక కాంగ్రెస్ హైకమాండ్ ఉందనేది నిజం. ఆయన్ను లొంగదీయడానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. అయినా జగన్ లొంగలేదు. అభియోగాలను, కష్టాలను సానుభూతిగా మలుచుకున్నారు. ఎన్టీఆర్ సినారియో వేరు. టీడీపీ ఆయనదే కాబట్టి పార్టీ వారసత్వం పిల్లలకు చెందుతుంది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి. ఆయన రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ దక్కాలని అంటారు కొందరు. కానీ జగన్ అలా జరగనివ్వలేదు.
వైఎస్సార్ వారసత్వం ఎక్కువ కాదు కదా కొంచెంలో కొంచెం కూడ కాంగ్రెస్ పార్టీకి పోనివ్వలేదు. నూటికి నూరు శాతం ఆయనే అందుకున్నారు. వైఎస్ జగన్ అను నేను మహానేత వైఎస్సార్ బిడ్డను, ఆయన నా తండ్రి అంటూ జనం మధ్యలోకి వెళ్లారు. ఆ వెళ్లడం ఎలా అంటే అందరూ జగన్ మా రాజన్న బిడ్డ, పెద్దాయన వారసుడు అనుకునేలా వెళ్ళిపోయారు.
ఆయన మీదున్న అభిమానంతో 2014లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి 2019లో ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకొన్ని దశాబ్దాలు తపస్సు చేసినా వైఎస్సార్ ను తమ వ్యక్తిగా చూపలేదు. అలా జగన్ తండ్రి వైఎస్సార్ వారసత్వాన్ని అందుకోవడంలో సఫలమయ్యారు. చివరగా ఒక్క మాట నందమూరి అసలు వారసులు రాజకీయ వారసత్వపు రేసులో వెనుకబడటానికి వైఎస్సార్ వారసుడు జగన్ విజయవంతం కావడానికి కారణం వారిలోని తపన, సమర్థతలేనని ఖచ్చితంగా చెప్పవచ్చు.