వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త కథ చెప్పారు. ఈసారి సింహం, తోడేళ్ళ కథ చెప్పారు. తాను సింహాన్నని చెప్పుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను తోడేళ్ళుగా అభివర్ణించారు. టీడీపీ అనుకూల మీడియా మీదనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ‘నేను మిమ్మల్నే నమ్ముకున్నా.. దేవుడ్నే నమ్మకున్నా.. నేను మోసాలు చేయలేదు.. మన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘జగనన్న చేదోడు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాస్త భిన్నంగా కనిపించారు.. ఇంతకు ముందు జరిగిన బహిరంగ సభలతో పోల్చితే.
‘పేపర్ స్లిప్పుల్లో చూసి చదివేస్తున్నారు తప్ప, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రసంగాలు చేయడంలేదు..’ అన్న విమర్శ వుంది గత కొన్నాళ్ళుగా. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మునుపటి ఫైర్ కనిపించింది. ‘ముసలి ముఖ్యమంత్రి’ అంటూ చంద్రబాబు గత పాలనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించడం గమనార్హం.
‘తోడేళ్ళు గుంపుగా వస్తున్నాయ్.. కానీ, నేను సింహం.. సింగిల్‌గానే వస్తాను..’ అని చెప్పారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ ప్రసంగానికి ఆ సభకు హాజరైన జనం నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ జగన్ నుంచి ఇలాంటి ప్రసంగాలే రావాలి.
ప్రజా సంకల్ప యాత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక సొంత ప్రసంగాలు చేయడంలో విఫలమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైతేనేం జగన్ ఈజ్ బ్యాక్.! వైసీపీకి ఇంతకన్నా కావాల్సిందేముంది.?
