వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేసి విమర్శించారు. తాడేపల్లిలో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రగిలిందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన వంటి ముఖ్యమైన పథకాల కోసం రూ. 3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు తొమ్మిది నెలలుగా చెల్లించలేదని, 104, 108 ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం కావడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
రైతులు వర్షాల కారణంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని జగన్ మండిపడ్డారు. కరెంటు ఛార్జీల పెంపు ప్రారంభమైందని, ఇసుక రేట్లు డబుల్ అయి ప్రజలపై భారం పడుతుందన్నారు. జగన్ ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇసుక ధరకంటే కూటమి ప్రభుత్వం రెండింతలు పెంచిందని విమర్శించారు.
ఇక మద్యం షాపులను చంద్రబాబు, ఆయన అనుచరుల చేతుల్లోకి ఇచ్చారని జగన్ ఆరోపించారు. బెల్టు షాపులకు వేలం పాటలో భారీగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, జిల్లాల అధ్యక్షులు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు.