విపక్షాలకు కొత్త టెన్షన్… జగన్ ముందున్న సవాళ్లివే!

ఏపీలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీ అనంతరం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు ఉండవని తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న ముందస్తు ముచ్చట్లకు తెరపడింది. దీంతో ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువుంది! ఇదే విషయాన్ని జగన్ నొక్కి చెప్పగా… ఇదే విషయం ఇప్పుడు విపక్షాలకు కొత్త టెన్షన్స్ పుట్టిస్తుందని అంటున్నారు.

జగన్ చెప్పిన మాటలో ఎన్నికల సమరానికి ఇంకా చాలా సమయం ఉందనేది స్పష్టమవుతుంది. అదే టైంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తొమ్మిది నెలలు పైగా సమయం చేతిలో ఉన్నట్లే. ఇది జగన్ కు చాలా ఎక్కువ సమయం అని, ఈ గ్యాప్ లో అక్కడక్కడా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలతగా మార్చుకోగల ఎత్తుగడలు వేయగలరని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

ఏపీలో జగన్ పై ఉన్న అతిపెద్ద ఫిర్యాదు… రోడ్లు! ఏపీలో మెజార్టీ నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయనేది తెలిసిన విషయమే! అయితే ఇప్పటికే కొన్ని చోట్ల మరమ్మత్తులు, గుంతలు పూడ్చడాలు వంటివి చేసినా, పూర్తి స్థాయిలో రోడ్ల పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్న పెద్ద విమర్శ ఇది.

సంక్షేమం విషయంలో జగన్ కు ఫుల్ మార్కులు వేస్తున్న జనం.. హామీలన్నీ నెరవేర్చారని భావిస్తున్నారు. ఫలితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నమ్మకస్తుడిగానే ప్రజల్లో జగన్ కు పేరొచ్చేసింది. పైగా ప్రత్యర్థి చంద్రబాబు కావడంతో అది మరింత ప్లస్ అయ్యింది. ఇక తాజాగా విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో చెప్పిన పెట్టుబడుల్లో ఈ 9 నెలల్లోనూ 25% కార్యరూపం దాల్చినా కూడా ఇక అభివృద్ధి అనే సమస్య కూడా పక్కదారి పట్టే ఛాన్స్ ఉంది.

ఇక మిగిలింది రోడ్ల సమస్య మాత్రమే!! ప్రస్తుతం జగన్ కు ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటుంది కేంద్రం. దానివెనకున్న రాజకీయ కారణాలు ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి… ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ తో జగన్ ఈలోపు ఉన్న ఈ రహదారుల సమస్యను కూడా పరిష్కరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఆ సమస్యను కూడా దాటినట్లు అవుతుంది.

ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఉన్న పంచాయతీని కూడా జగన్ సెటిల్ చేసేసుకున్నారు. ఫలితంగా ఉద్యోగ సంఘాల నేతలు మైకులముందుకొచ్చి జగన్ కు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు.. జగన్ తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో… ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది.

ఇక నియోజకవర్గ స్థాయిల్లో చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను క్లియర్ చేసి, ఆ రోడ్ల మరమ్మత్తులు పూర్తిస్థాయిలో చేపడితే… ఇక జగన్ కు తిరుగుండదనేది విశ్లేషకులు చెబుతున్న మాటగా ఉంది. ప్రస్తుతం ఏపీలో విపక్షాలను టెన్షన్ పెడుతున్న అంశం ఇదే!

ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఉంటే… జగన్ ను ఏదోలా ముప్పు తిప్పలు పెట్టొచ్చని చంద్రబాబు & కో భావించారు. అందులో భాగంగానే హస్తిన పర్యటనలు చేపట్టారు. పైగా జగన్ ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రచారం చేశారు. అయితే తాజాగా సీఎం హోదాలో జగనే ముందస్తుపై క్లారిటీ ఇవ్వడంతో… జగన్ చేతిలో ఇంకా తొమ్మిది నెలలు ఉన్నాయనే ఆలోచనే… విపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు!

మరి ఈ తొమ్మిది నెలలూ రోడ్ల సమస్య.. నియోజకవర్గ స్థాయిలో పెండింగుల్లో ఉన్న బిల్లుల సమస్యతో పాటు స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేక్త సమస్యను కూడా వీలైనంత తొందర్లో పరిష్కరించుకుని ఎన్నికలు వెళ్తారా… వెళ్తే ఎలాంటి ఫలితాలు సాధిస్తారు… ఈ క్రమంలో విపక్షాలు ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నాయనేది వేచి చూడాలి!