అనంతబాబు విషయంలో జగన్ అడ్డంగా దొరికేస్తున్నారా?

ఎవరు అవునన్నా కాదన్నా జగన్ ను ఎస్సీలు, మైనారిటీలూ బలంగా ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ బలం కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీలు అనేది బహిరంగ రహస్యం! ఈ విషయంలో వారికి అన్నిరకాలుగానూ అండగా ఉండాల్సిన జగన్.. వారిని ఇబ్బందులకు గురిచేసినవారికి తొడుగా ఉండటం విమర్శలపాలవుతుంది.

అవును… దళిత యువకుడిని చంపిన కేసులో జైలుకు వెళ్లి షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో జగన్ ఉదారంగా ఉంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా అనంతబాబు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఆయనకు అడగ్గానే అనుమతి రావడంతోపాటు… వైకాపా నుంచి సస్పెండ్‌ అయినా కూడా వైకాపా ఎమ్మెల్సీగానే రంపచోడవరంలో ఒక సభ నిర్వహించడం!

దీంతో జగన్ దళితుల విషయంలో, అనంతబాబు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే కామెంట్లు మొదలైపోయాయి. ఒకపక్క దళితులను మెప్పించడం కోసం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్… మరోపక్క అతడు వైకాపా నేతగా సభ నిర్వహించుకుంటుంటే.. దానినికి అనుమతి ఇవ్వడంతోపాటు.. పోలీసుల అండదండలతో సభకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

దీంతో ఇలాంటి వ్యవహారశైలి జగన్ ను ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

కాగా… అనంతబాబు తన వద్ద పని చేసే దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కిరాతకంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అరాచకంపై దళితుల్లో ఇంకా అశాంతి, ఆందోళన గూడు కట్టుకునే ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిందితుడే సభ పెట్టడం ద్వారా తననెవరూ ఏమీ చేయలేరనేలా రాష్ట్రంలోని దళితులందరికీ సవాల్‌ చేయడమే అవుతుందనేది మరో కామెంట్ గా ఉంది.