ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 40శాతం ఓట్లైతే వచ్చినా.. సీట్లు మాత్రం 11కి పరిమితమైపోయిన పరిస్థితి. ఇది ప్రత్యర్థులు సైతం ఊహించని ఓటమి అయ్యి ఉండొచ్చు. కొంతమంది వైసీపీ నేతలకు ఓటమిపై నమ్మకం ఉన్నా.. ఈ స్థాయి ఘోరాన్ని వారు సైతం ఊహించి ఉండరు. సర్వే ఫలితాలు తలకిందులైన ఫలితాలు వచ్చాయి!
ఆయితే… ఏపీలో వైసీపీ ఈ స్థాయిలో ఘోర ఓటమికి సలహాదారుల పాత్ర అత్యంత కీలకంగా మారిందనే కామెంట్లు ఆఫ్ ద రికార్డ్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సజ్జల పేరు ప్రముఖంగా ప్రస్థావిస్తున్న పరిస్థితి. జగన్ కి నేతలకూ మధ్య సజ్జల ఇనుప కంచెలా మారారనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఇదే సమయంలో… తాము చెప్పిన విలువైన సూచనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదనేది ప్రధానమైన ఫిర్యాదు.
ఉదాహరణకు… ఇటీవల పార్టీ ఓటమిపై పెర్ ఫెక్ట్ పోస్ట్ మార్టం చేసినట్లుగా ఒక వీడియో విడుదల చేశారు కాసు మహేష్ రెడ్డి. తమ ఘోర ఓటమికి కారణాలు చెబుతూ… లిక్కర్ విషయంలో చాలా డ్యామేజ్ జరుగుతుందని.. పాలసీలో మార్పు అనివార్యమని సజ్జలకు, విజయసాయిరెడ్డికీ చెప్పినా… వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు! ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకూ పోకుండా ఓపెన్ గా అసలు విషయం చెప్పేశారు.
అయితే.. ఇలా పబ్లిక్ గా చెప్పలేకపోయినవారు మాత్రం ఆఫ్ ద రికార్డ్ ఇంకా గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. అయితే… వైసీపీ గెలిచి ఉంటే సజ్జలను హీరోని చేసి ఉండేది మీడియా & నాయకులు! కానీ… ఓటమి వచ్చే సరికి కచ్చితంగా పోస్ట్ మార్టం జరుగుతుందనేది తెలిసిన విషయమే.. జరగాలి కూడా! అయితే… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అటు సజ్జల రామకృష్ణారెడ్డికి, నాడు వైఎస్సార్ ఆత్మగా పేరు సంపాదించుకున్న కేవీపీ రామచంద్ర రావుకి కంపేరిజన్స్ చర్చకు రావడం!
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనధికారిక సలహాదారుడిగా ఉన్న కేవీపీ రామచంద్ర రావు ప్రాణ స్నేహితుడు! ఫలితంగా… ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉన్నా, తప్పులు జరుగుతున్నా, తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుగా అనిపిస్తున్నా వాటిని ఖండించలేకపోయినా.. కనీసం వివరించే అవకాశం ఉండేది. “రాజా.. ఈ ఆలోచన సరైంది కాదేమో.. ఒకసారి పునరాలోచిస్తే బెటరేమో చూడు!” అని వైఎస్సార్ కి కనీసం సలహా ఇవ్వగలిగే స్థాయి నాడు కేవీపీకి ఉండేదని అంటారు.
ఫలితంగా.. తనతో పాటు కేబినెట్ మొత్తం కలిసి తీసుకున్న కొన్ని నిర్ణయాలను నాడు వైఎస్సార్ పునఃసమీక్షించుకునేవారని.. ఫలితంగా డ్యామేజీ జరగకుండానే జాగ్రత్తపడేవారని చెబుతారు. వారిద్దరూ సమకాలికులు, స్నేహితులు కావడం ఇక్కడ బాగా కలిసొచ్చిన అంశం. వారి సాన్నిహిత్యం, నిర్ణయాలు, మార్పులు, సమీక్షలు, అవగాహన గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ని అడిగితే బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు చెబుతారని అంటారు.
కట్ చేస్తే… సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి “సాక్షి”లో ఉద్యోగి. ఆయనపై ఉన్న నమ్మకమో.. లేక, సమర్థుడు అనే విశ్వాసమో తెలియదు కానీ.. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు జగన్. అంటే… తన సంస్థలో పనిచేసే వ్యక్తిని తనకు ప్రభుత్వంలో సలహదారుగా నియమించుకున్నారు. అప్పుడు ఏమవుతుంది?… జగన్ కు సలహాలు ఇస్తారు.. జగన్ చెప్పింది కార్యరూపంలోకి తెస్తారు.. అంతే తప్ప… జగన్ చెప్పినదాంట్లో తప్పులు ఎంచే అవకాశం ఆల్ మోస్ట్ ఉండకపోవచ్చు!
“బాస్ ఆల్ వేస్ కరెక్ట్” అన్నట్లుగానే వ్యవహారం సాగి ఉంటుంది! సజ్జల చెబితే జగన్ తీసుకుంటాడా లేదా అన్నది తర్వాత విషయం.. అసలు సజ్జల చెప్పగలిగే సాహసం చేస్తారా? ఒక వేళ తాను ఇచ్చిన సలహాకి.. జగన్ కౌంటర్ వేస్తే పరిస్థితి ఏమిటి? ఒకేసారి తండ్రీకొడుకుల ఇద్దరి ఉద్యోగాలకూ ఎసరు వచ్చే ప్రమాధం ఉంది కదా! అనేవి సజ్జల సందేహాలు, భయాలు అయ్యి ఉండొచ్చు! ఇలా సజ్జల సేఫ్ గేం ఆడే అవకాశం ఉంది! ఫలితంగా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ఇక్కడ జగన్ గమనించాల్సిన విషయం ఏమిటంటే… నాయకుడు ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నా.. ప్రజామోదం కాని నిర్ణయాల దిశగా పావులు కదుపుతున్నా.. “జగన్.. ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించు.. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది” అని చెప్పగలిగే సలహాదారుడో, సన్నిహితుడో జగన్ పక్కనలేకపోవడమే ఈ భారీ డ్యామేజ్ కి కారణం అని అంటున్నారు పరిశీలకులు. ఎంత మేధావి అయినా పొరపాట్లు చేస్తాడు.. అలాంటప్పుడు అవి పొరపాట్లని చెప్పేవారు పక్కన లేకపోతే.. ఇలాంటి ఫలితాలు స్వీయానుభవంలోకి వస్తాయి!
అందుకే ఇకనైనా జగన్ కు కావాల్సింది.. పక్కన ఉండాల్సింది.. వైఎస్సార్ కి కేవీపీ లాంటి మనిషే తప్ప… “ఓకే బాస్.. ఎస్ బాస్.. ష్యూర్ బాస్.. డన్ బాస్” అనే వారు కాదు! పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… సజ్జల ప్రొపెషనల్ పొలిటీషియన్ కాదు..!! మరి జగన్ ఈ కరెక్షన్స్ చేసుకుంటారా.. లేక, “నాకు నచ్చినట్లు నేనుంటా ఇట్స్ మై లైఫ్” అనే ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి. అయితే… వైసీపీ అంటే జగన్ కంపెనీ కాదు… కోట్ల మంది అభిమానులు, లక్షల మంది కార్యకర్తల మనోభావలతో ముడిపడిన ఒక బంధం! ఇది జగన్ మరువకూడని విషయం!