నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ పరంగా దూకుడుమీదున్న వైఎస్ జగన్… పరిపాలనలోనూ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమం పని పూర్తిగా అమలుచేస్తిన జగన్… ఇప్పుడు నిరుద్యోగులపై దృష్టిసారించారు. కోవిడ్ కారణంగానూ, రాష్ట్ర విభజన కారణంగానూ జీవితంలో విలువైన సమయాన్ని యువత కోల్పోయిందని, ఫలితంగా నిరుద్యోగులకు ఇబ్బంది కలిగిందని జగన్ సర్కార్ భావించిందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అవసరమైన సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

త్వరలోనే డీఎస్సీతో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం నాన్‌ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది.

ఇదే సమయంలో యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు వర్తిస్తుందని తెలిపింది. కొంత కాలంగా ప్రభుత్వం డీఎస్సీతో పాటుగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ పైన కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువడుతుండనే అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వయసుపైబడింది అని నిరాస పడుతున్న నిరుద్యోగులకు వరం అనే చెప్పుకోవాలి!