గుంటూరు నేతకు పెద్ద షాక్ ఇచ్చిన  జగన్

ఎన్నికలు దగ్గరపుతున్న నేపధ్యంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ  సమన్వయకర్తలకు గట్టి షాకులే ఇస్తున్నారు. ఇప్పటికే నలుగురు నేతలకు షాకిచ్చిన జగన్ తాజాగా  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త లేళ్ళ అప్పిరెడ్డికి పెద్ద షాకే ఇచ్చారు. నియోజకవర్గంలో సమన్వయకర్తగా గడచిన నాలుగున్నరేళ్ళుగా పనిచేస్తున్న లేళ్ళ స్ధానంలో ఏసురత్నాన్ని నియమించారు.  విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలోనే  ఏసురత్నం ఈమధ్యనే పార్టీలో చేరారు.  కొత్త నేత కోసం లేళ్ళను పక్కనపెట్టటాన్ని అప్పిరెడ్డి మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

నిజానికి లేళ్ళ చాలా కాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. కానీ ఆయనపై విపరీతమైన ఆరోపణలున్నాయి. ఎప్పటికప్పుడు జగన్ హెచ్చరిస్తున్నా లేళ్ళపై ఆరోపణలైతే తగ్గటం లేదు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారనే ఏకైక కారణంతోనే లేళ్ళను జగన్ భరిస్తున్నారు. కానీ లేళ్ళ వ్యవహారశైలిలో మాత్రం మార్పు రాలేదు. దాంతో ఇక లాభం లేదన్న ఉద్దేశ్యంతో లేళ్ళను పిలిపించిన జగన్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టిచ్చేది లేదని కచ్చితంగా చెప్పేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తానని హమీ కూడా ఇచ్చారు అదే సమయంలో. తనను సమన్వయకర్తగా తొలగించరన్న ధీమాతో ఉన్న లేళ్ళ జగన్ తాజా చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

అప్పటి నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంచి నేత కోసం జగన్ వెతుకుతున్నారు. అయితే ఈమధ్యనే పార్టీలో చేరిన ఏసురత్నాన్ని వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి అందరికీ షాకిచ్చారు. ఏసురత్నం పోలీసు ఉన్నతాధికారిగా జిల్లాలో సుపరిచితుదట. కాబట్టి ఏసు రత్నమే వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి అవుతారేమో ? మొత్తం మీద జగన్ తీసుకుంటున్న కొన్ని చర్యలు నేతలకు పెద్ద షాకే ఇస్తున్నాయి.

 

విశాఖపట్నంలో కూడా రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చేశారు. అలాగే, గుంటూరు లోక్ సభ సమన్వయకర్త లావు శ్రీక్రుష్ణ దేవరాయలను నరసరావుపేటకు మార్చేశారు. అలాగే, నరసరావుపేట సమన్వయకర్తను గుంటూరుకు మార్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని చిలకలూరుపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ స్ధానంలో కొత్తగా చేరిన విడదల రజనీకుమారిని నియమించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి స్ధానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్ధులను లేకపోతే సమన్వయకర్తలను ఎంపిక చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఆరోపణలున్న వారిని, సరిగా పనిచేయని వారిని జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.