ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇటీవలే సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యేడాదిలో ఆయన అత్యధికంగా సంక్షేమ పథకాల అమలు మీదే దృష్టి సారించారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా, అప్పులు పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలుచేసి తీరాల్సిందేనని సంకల్పించుకున్నారు. నవరత్నాల ద్వారా 3.9 కోట్ల మంది ప్రజలకు 40,000 కోట్ల రూపాయల లబ్డిని చేకూర్చారు. యేడాది కాలంలో ఇంత భారీ మొత్తాన్ని సంక్షేమం కోసం ఖర్చు చేయడం అంటే మాటలు కాదు. అందుకు చాలా ధైర్యం ఉండాలి. అందునా ఆంద్రప్రదేశ్ లాంటి కొత్త, రాజధాని అంటూ లేని రాష్ట్రంలో చేయడం అంటే తెగింపు కావాలి. ఆ తెగింపు తనకుందని జగన్ నిరూపించుకున్నారు.
మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలే కాదు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు ఆశ్చర్యపోయి ఏపీ వైపు, జగన్ వైపు చూశాయి. అందుకే జగన్ తన పనితనాన్ని పూర్తిగా ప్రజల ముందు ఉంచాలని భావించారు. అనుకున్నదే తడవుగా తన ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ఏం చేసింది, ఏయే సంక్షేమ పథకాలు అమలుచేశారు, ఏయే పథకం కింద ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు ఎంతమంది లబ్దిదారులకు చేరింది, ఇంకా ఏమేం చేయబోతున్నారు లాంటి స్పష్టమైన వివరాలతో ఒక బుక్ లెట్ రూపొందించారు. మేనిఫెస్టోను, ఈ బుక్ లెట్ ను పక్కపక్కన పెట్టుకుని చూస్తే ప్రభుత్వం చేసిన పనులు అర్థమైపోతాయి. ఎన్నికల హామీలు ఎంతవరకు అమలయ్యాయి, ఇంకెన్ని అమలుచేయాలి అనే విషయమై ఒక అవగాహన వస్తుంది.
ఇలాంటి బుక్ లెట్స్ సుమారు 78 లక్షల కాపీలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు పంచారట. వీటితో గత ప్రభుత్వ పాలనకు తన పాలనకు తేడా ఏంటో చెప్పాలనేది జగన్ అభిప్రాయం. తన పాలన మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో లెక్కలను అచ్చువేసి మరీ జనం ముందు ఉంచలేరు. నిజానికి ఈ లెక్కలు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకునే వీలుంది. కానీ ఎంతమంది జనం దాన్ని వినియోగించుకుంటున్నారు. అందుకే ఇలా అడగకపోయినా బాధ్యతగా లెక్కలు చెబుతున్నారు కొత్త సీఎం. ఈ తరహా పారదర్శకతను గత ప్రభుత్వాలు ఏవీ పాటించలేదు. అందుకే జగన్ ఆలోచన రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అయింది.