మారిన వైఎస్ జగన్.! మారాలి, తప్పదు.!

దుష్ట చతుష్టయం ప్రస్తావన లేదు. దత్త పుత్రుడంటూ ఎగతాళి కూడా లేదు.! సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో మమేకం.. ఇదే దెందులూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కొత్త కోణం కనిపించింది. సరే, సభకి జనాన్ని రప్పించేందుకు అధికారులు, స్థానిక వైసీపీ నాయకత్వం పడ్డ కష్టాలు.. అది వేరే చర్చ.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా జనంతో మమేకమయ్యేందుకు ఏర్పాటు చేస్తోన్న అధికారిక బహిరంగ సభల్లో, సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదల కార్యక్రమం చేపడుతున్నారు. అది అభినందనీయమే. కానీ, విపక్షాలపై రాజకీయ విమర్శల డోసు పెంచేస్తుండడంతో.. అసలు విషయం మరుగున పడుతోంది.

రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలకు వైసీపీలో చాలామంది నేతలున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పరిపాలనా వ్యవహారాల మీదనే ఫోకస్ పెట్టాలి. సంక్షేమ పథకాలకు సంబంధించి సమర్థవంతంగా క్యాలెండర్ అమలు చేస్తున్నప్పుడు, విపక్షాలను తూలనాడాల్సిన అవసరమే లేదు. కానీ, నిన్న మొన్నటిదాకా ఈ విషయంలో ‘తప్పుడు సలహా’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాయిని తగ్గించేస్తూ వచ్చింది. దెందులూరు సభలో అలాంటి పొరపాట్లేమీ జరగలేదు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైఎస్ జగన్ భయపడ్డారు..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు అనుకోవచ్చుగాక.

కానీ, ముఖ్యమంత్రి బాధ్యతలు వేరు.. ఆ పదవి తాలూకు హుందాతనం వేరు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి ప్రవర్తన, పరివర్తననే ప్రజలు ఆశిస్తారు.