జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హై కోర్ట్ నుండి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 100సార్లు జగన్ ప్రభుత్వానికి కోర్ట్ ల నుండి ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రామకృష్ణ రూపంలో మరో సమస్య వైసీపీ ప్రభుత్వానికి వచ్చింది. గత రెండు మూడు నెలలుగా జడ్జి రామకృష్ణ వ్యవహారం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఆయనను అధికార పార్టీకి చెందిన నేతలు టార్గెట్ చేసారని, వేదిస్తున్నారని, కేసులు పెట్టటం, మీడియా ముందుకు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఇక మరో పక్క జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంలో, కోర్టులని ఈశ్వరయ్య టార్గెట్ చేసారు అంటూ, ఆయన ఆడియో టేప్ బయట పెట్టి, అది కూడా హైకోర్టు ముందుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో ఎస్.రామకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కొత్తకోట తహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హై కోర్ట్ ను ఆశ్రయించారు.
ఒక జడ్జినే బయటకు రావద్దంటూ ఆదేశాలు ఇవ్వడమంటే వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడమేనని హై కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలపై ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తహశీల్దార్ ఆదేశాలను పది రోజులపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. పది రోజుల తర్వాత ఈ కేసులో మరోసారి వాదనలు విని, తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా చేస్తున్న పనుల వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.