యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇన్నాళ్లు మంత్రులకు, ఎంపీలకు గొడవలు అనుకుంటే ఆ జాబితాలో మంత్రులు కూడ చేరడం గమనార్హం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పొసగడంలేదు. నాలుగైదు పంచాయితీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు నానుతున్నాయి. సర్దుకుపొమ్మని జగన్ చెబుతుంటే ఆయన ముందు తలూపి ఆయన తప్పుకోగానే ఉప్పు నిప్పుల్లా మారిపోతున్నారు నేతలు. ఈ గొడవలను తేల్చడానికి ఆయా జిల్లాల నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త వివాదం ఒకటి వెలుగులోకి వచ్చిందట. అది కూడ మంత్రికి, ఎంపీకి కావడం పార్టీలో సంచలనంగా మారింది.
ఈ ఆధిపత్యపోరు మచిలీపట్నం కేంద్రంగా నడుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంచిలీపట్నం ఎమ్మెల్యే కమ్ మంత్రి పేర్ని నానికి ఈ రగడ నడుస్తోంది. ఎంపీ బాలశౌరి ఈమధ్య మచిలీపట్నం పోర్టు పనుల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పోర్టుకు సంబంధించిన పనుల విషయమై ఆయన దూకుడుగా వ్యవరిస్తున్నారు. తన ప్రతిపాదనలను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు పెట్టి పనులు జరుపుకుంటున్నారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో మంచిలీపట్నంతో పాటు గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నిటి మీద ఒక రకంగా ఉన్న ఎంపీ మచిలీపట్నం మీద ఇంకో రకంగా ఉన్నారు.
మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులను అక్కడి ఎమ్మెల్యేలకే వదిలేస్తూ మచిలీపట్నం వ్యవహారాల్లో మాత్రం సొంతగా కలుగజేసుకుంటున్నారు. ఇది మంత్రి పేర్ని నానికి అస్సలు రుచించట్లేదట. పేర్నినాని కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు మంత్రి కూడ. మంత్రి అంటే ఆ పవర్, పట్టు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి తర్వాత మేమే అనుకుంటుంటారు. పేర్ని నాని కూడ అలానే ఉన్నారు. అలాంటి ఆయన తన నియోజకవర్గంలో వేరొకరి జోక్యాన్ని ఎలా సహించగలరు. సొంత పార్టీ ఎంపీ అయినా సరే తన నోటీసుకు రాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిపోతుండటం ఏమిటని మండిపడుతున్నారట. మచిలీపట్నంలో సమస్యలు ఉంటే తనతో చర్చించాలి కానీ ఏకంగా సీఎం వద్ద పంచాయితీ ఏమిటని అంటున్నారట.
మంత్రి ఇంతలా కోప్పడుతున్నా ఎంపీ మాత్రం తగ్గట్లేదట. తన పంథాలోనే పనులు చేసుకుంటూ వెళుతున్నారు. బాలశౌరికి జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. ఢిల్లీ స్థాయి పార్టీ రాజకీయాల్లో కూడ కీలకంగా ఉంటున్నారు. అందుకే ముఖ్యమంత్రికి తరచూ కలవగలుగుతున్నారు. ఈ వెసులుబాటే ఆయన్ను దూసుకుపోయేలా చేస్తోంది. ఇక ఈ వివాదం ముఖ్యమంత్రి వరకు వెళ్లిందట. కానీ ఎంపీ, మినస్టర్ ఇద్దరూ సన్నిహితులే కావడంతో ఎవరిని తగ్గమని చెప్పాలో ఆయనకు కూడ తెలియడంలేదనేది పార్టీ వర్గాల్లో టాక్.