ఆరోగ్యశ్రీ వివాదానికి సంబంధించి పత్రికా ప్రకటన ఒకటి బయటకు వచ్చింది. ఆరోగ్యశ్రీ సేవల్లో ఇబ్బందులేమీ వుండవనీ, రోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు కొనసాగుతాయన్నది ఆ ప్రకటన తాలూకు సారాంశం.
జరుగుతున్నది దుష్ప్రచారమేనంటూ ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ‘ఆరోగ్యశ్రీ’ పథకం తొలిసారిగా తెరపైకొచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పేదవడానికి అవసరమైన ఖరీదైన వైద్యం అందేలా ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.
సరే, ప్రైవేటు ఆసుపత్రుల్ని ఉద్ధరించే పథకమన్న విమర్శలున్నాయనుకోండి.. అది వేరే సంగతి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది.. ఆ చెల్లింపులే అప్పుడప్పుడూ బకాయిలు పడుతుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. దాదాపు వెయ్యి కోట్ల పైన బకాయిలున్నాయన్నది ఓ అంచనా.
బకాయిల్ని చెల్లిస్తున్నామంటూ సవివరంగా పేర్కొంది ప్రభుత్వం, సదరు ప్రకటనలో. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ తీర్మానించినట్లుగా తమకూ సమాచారం వుందని ప్రభుత్వం వివరించింది కూడా. ఇందులో దుష్ప్రచారం ఏముంది.?
కాస్త లేటుగానే అయినా ప్రభుత్వం స్పందించి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. పత్రికా ప్రకటనలో అన్నీ సవివరంగా పేర్కొని, చివరికి దుష్ప్రచారమని చెప్పడమంటే గవర్నమెంటుని డ్యామేజ్ చేస్తున్నట్లే కదా.? ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారోగానీ, ఇదంతా ‘వైఎస్ జగన్‌కి సహాయ నిరాకరణ’ అనుకోవాలా.? అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది.