అవును రెండు పార్లమెంటు సీట్లలోను జగన్మోహన్ రెడ్డి ప్రయోగంచేశారనే చెప్పాలి. అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందుపురం పార్లమెంటు సీట్లను బిసిలకు కేటాయించటం ద్వారా పెద్ద ప్రయోగం చేశారనే అనుకుంటున్నారు. మామూలుగా అయితే ఏ పార్టీ అయినా అనంతపురం సీటును రెడ్లకు కేటాయిస్తుంటారు. హిందుపురంలో టిడిపి అయితే బిసిలకు, కాంగ్రెస్ అయితే సామాజికవర్గాలను మారుస్తుటుంది.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసిపికి మళ్ళింది. దాంతో 2014లో ఫెయిల్ అయిన జగన్ మొన్నటి ఎన్నికల్లో మాత్రం పెద్ద ప్రయోగమే చేశారు. జిల్లాలోని రెండు సీట్లను బిసిలకు కేటాయించటం వెనుక పెద్ద వ్యూహమే దాగుంది. హిందుపురం పార్లమెంటులో వైసిపి తరపున పోటీ చేసిన గోరంట్ల మాధవ్ కురబ సామాజికవర్గానికి చెందిన వారు.
అలాగే అనంతపురంలో వైసిపి తరపున పోటీ చేసిన తలారి రంగయ్య బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. విచిత్రమేమిటంటే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగినవారే. బిసిల్లోని రెండు ఉపకులాలకు చెందిన వారిని జగన్ పోటీలోకి దింపటానికి పెద్ద కారణమే ఉంది.
హిందుపురంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకూ కురబలను పోటీలోకి దింపలేదు. అలాగే కురబల తర్వాత బోయలు ఓట్లు కూడా హిందుపురం పార్లమెంటు పరిధిలో బాగానే ఉన్నాయి. అలాగే అనంతపురం పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన రంగయ్య ఉపకులం బోయల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీరి తర్వాత కురబల ఓట్లు కూడా ఎక్కువే.
అంటే ఇద్దరు అభ్యర్ధులకు రెండు ఉపకులాల ఓట్లు పడతాయన్నది జగన్ అంచనా. బిసిల ఓట్లతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లు కూడా వైసిపికి పడితే గెలుపు ఖాయమనే చెప్పాలి. మరి ప్రయోగం ఫలిస్తుందో లేదో 23న తర్వాత కానీ తెలీదు.