హాట్ టాపిక్… మూడు బాణాలు సిద్ధం చేస్తున్న జగన్!

ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తున్న జగన్.. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రజలకు ఇచ్చే వరాల జల్లులతో పాటు, ఎన్నికల ముందు చేయాల్సిన పనులపైనా కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు సమాంతరంగా ఈ విషయాలపైనా చర్చ జరుగుతుందని.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మూడు బాణాలను జగన్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. తనకు ప్రజలతోనే పొత్తు అని ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా అవసరమైన చోట స్థానిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను మారుస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇవ్వాల్సిన వరాలతోపాటు.. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులు, నేరవేర్చాల్సిన హామీలపైనా దృష్టి సారించారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… వృద్ధులకు పెన్షన్, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు ఐఆర్ వంటి హామీలు, అమలు వంటి విషయాలపై జగన్ దృష్టి సారించారని తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ విషయమ్ళో జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం… పెన్షన్ రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఈ ఏడాది జనవరి నుంచి వృద్ధులకు రూ.3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.

ఈ సమయలో మరలా తాను అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4 వేలకు పెంచే హామీ ఇవ్వడంపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబధించిన సాధ్యాసాధ్యాలను జగన్ అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో… రైతుకు రుణ మాఫీ అంశంపైన పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… రైతులకు రుణమాఫీ ఎంత మేర చేయాలి.. ఫలితంగా ప్రభుత్వం ఏ మేరకు భారం పడుతుంది వంటి విషయాలపి చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

అదేవిధంగా… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపైన ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిన జగన్ సర్కార్… ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే 2019లో 27 శాతం ఐఆర్ ప్రకటించారు జగన్. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత లేనప్పటికీ పైన చెప్పుకున్న మూడు అంశాలపైనా అధికారపార్టీ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది.