దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా జగన్ సర్కార్.. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… 2023–24 సీజన్ కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని సెప్టెంబర్ 1న అందించనుంది.
అవును… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా… కౌలు రైతుల ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. దేవదాయ భూములను సాగు చేసుకుంటోన్న రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
కౌలు రైతులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే “క్రాప్ కల్టివేటర్స్ రైట్స్” కార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తంగా 1,42,693 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలుదారులకు సీసీఆర్సీ లను అందజేసింది. వారితో పాటు మరో 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సీసీఆర్సీ కార్డులను మంజూరు చేసింది.
దేవాదాయ భూములను సాగు చేసుకుంటోన్న కౌలు రైతులకు.. రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి. 7,500 రూపాయల చొప్పున మొత్తం 109.74 కోట్ల రూపాయలను దీనికోసం వ్యయం చేయనుంది. బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు.