హత్యాయత్నంపై ఇవి…వాస్తవాలు-బయటపెట్టిన జగన్

తన హత్యకు కుట్ర జరిగిందని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న 25వ తేదీన హత్యాయత్నం తర్వాత మొదటిసారి లేఖ రూపంలో జగన్ గొంతు విప్పారు.  కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన జగన్ హత్యాయత్నం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. అదే లేఖలో చంద్రబాబునాయుడు చేయిస్తున్న సిట్ విచారణపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టంగా చెప్పటం గమనార్హం. రాష్ట్రప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్ధతో ఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు. అంటే సిబిఐ విచారణా లేకపోతే జ్యుడీషియల్ విచారణ అన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిని తామే సానుభూతి కోసం చేయించుకున్నామని చంద్రబాబు, డిజిపి, మంత్రులు ముందుగానే చెప్పేసిన తర్వాత జరిగే విచారణలో వాస్తవాలు బయటకు రావని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను కూడా రాజ్ నాథ్ కు జగన్ వివరించారు. విమానాశ్రయంలో గాయపడిన తర్వాత హైదరాబాద్ కు ఎందుకు వచ్చేరో కూడా  స్పష్టంగా చెప్పారు. జరిగిన ఘటనను తమపై ఎలా రుద్దాలో అన్న విషయాన్ని చంద్రబాబు ముందుగానే నిర్ణయించుకుని ఆ తర్వాత విచారణకు చేయిస్తున్న కారణంగా విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం లేదన్నారు.

తనపై హత్యాయత్నానికి ఆపరేషన్ గరుడ అనే ఓ పథకాన్ని సిద్ధం చేసుకునే కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండే విమానాశ్రయంలో అమలు చేయాలని అనుకోవటం వెనుక కూడా పెద్ద కుట్రుందన్నారు. ఒకవేళ హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు సక్సెస్ అయితే ఆ నెపాన్ని కేంద్రప్రభుత్వం మీదకు నెట్టేసి తాను లబ్దిపొందుదామని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు మండిపడ్డారు.

ఒకవేళ ప్లాన్ విఫలమైతే సానుభూతి కోసం తామే తనపై హత్యాయత్నం నాటకం ఆడామని ప్రచారంలోకి తెచ్చి తమపై ఎదరుదాడి చేయాలన్న క్రూరమైన ఆలోచనే చంద్రబాబులో కనబడుతోందని జగన్ ఆరోపించారు. హత్యాయత్నం ఘటన నుండి తాను తప్పించుకోగానే డిజిపి, మంత్రులు, చంద్రబాబు చేసిన ఆరోపణలే తన అనుమానాలకు సాక్ష్యాలుగా జగన్ లేఖలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి తమ అనుమానాలు నివృత్తి కావాలన్నా, కుట్ర వెనుక నిజాలు బయటకు రావాలన్నా రాష్టప్రభుత్వ పరిధిలో లేని విచారణ సంస్ధ ద్వారానే విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. మరి కేంద్రప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.