వైఎస్ జగన్ దయతోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉనికి.!

ys-jagan-courtesy-tdp-chief-chandrababu-existence

ముఖ్యమంత్రి పదవిలో వైఎస్ జగన్ వుండబట్టి సరిపోయింది.. అదే నేను గనుక ముఖ్యమంత్రి అయి వుంటే చంద్రబాబు వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా వుండేవారు కాదు..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ‘పుంగనూరు పుడింగి’ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి వెటకారాలు చేస్తున్న విషయం విదితమే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి పెద్ద షాకే ఇచ్చింది వైసీపీ. దానికి తెరవెనుకాల కథ నడిపింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఆ కారణంగానే చంద్రబాబు, పెద్దిరెడ్డి మీద అసహనం పెంచుకున్నారు.. అవాకులు చెవాకులు పేలుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఒక్కటి మాత్రం నిజం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుక ముఖ్యమంత్రి అయి వుంటే, చంద్రబాబు వెంట నిజంగానే ఒక్క ఎమ్మెల్యే కూడా వుండి వుండేవారు కాదు. టీడీపీ అంతలా బలహీనమైపోయేది.

వల్లభనేని వంశీ సమా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ బాట పట్టారు. వాళ్ళందరికీ చంద్రబాబు మీద నమ్మకం సన్నగిల్లింది. పార్టీలో లోకేష్ ‘పైత్యం’ పెరిగిపోయి, పార్టీనే నాశనం చేస్తోందంటూ టీడీపీ నుంచి నేతలు బయటకు వచ్చేయడం అనేది 2019 ఎన్నికల ముందు నుంచీ జరుగుతున్నా చంద్రబాబు వాస్తవాల్ని తెలుసుకోలేకపోయారు. సరే, ఆ సంగతి పక్కన పెడితే.. మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయే అవకాశం వుంది. అదే జరిగితే, చంద్రబాబుకి ప్రస్తుతం వున్న ప్రతిపక్ష నేత హోదా కూడా పోయేలా వుంది. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని గతంలో ప్రకటించిన వైఎస్ జగన్ ఆ మాటకు కట్టుబడి వుంటే బావుండేదేమో.