పాల పార్టీ వైసీపీ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. పాలకవర్గం మీద సంతృప్తి అంటూ మొదలైతే అది ముఖ్యమంత్రి నుండే మొదలుకావాలి. ముందుగా ఆయన మీద ప్రజలు వ్యతిరేకత తెలుపుతారు. ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద పడుతుంది. కానీ వైసీపీలో మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పేరును పెంచుకుంటూ పోతుంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఆ పేరును డ్యామేజ్ చేస్తున్నారు. తరచూ ఏదో ఒక గొడవతో ప్రతిపక్షాల చేతికి చిక్కిపోతూ మీడియాలో నానిపోతున్నారు. అసలే కాచుకుని కూర్చున్న ప్రత్యర్థులు ఎమ్మెల్యేలు చేసే చిన్నా చితకా పొరపాట్లను కూడ మహా ఘోరాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంతో జగన్ పడుతున్న కష్టంలో సగం బూడిదలో పోసిన పన్నీరైపోతోంది.
మొదట్లో పార్టీలోని గొడవలను పెద్దగా పట్టించుకోలేదు అధిష్టానం. సంక్షేమ పథకాలు, నిధుల వేట అంటూ పైస్థాయిలోనే దృష్టి మొత్తం పెట్టడంతో క్షేత్రస్థాయిలో నేతలు కొంచెం గాడి తప్పారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. నియోజకవర్గాల్లో గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగుతున్నారు. చీరాల, గణాంవరం, తాడికొండ, నెల్లూరు, నగిరి, చిలకలూరిపేట లాంటి ప్రధాన నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అస్సలు పొసగట్లేదు. విడదల రజినీ, ఉండవల్లి శ్రీదేవి, రోజా, నందిగం సురేష్. లావు శ్రీకృష్ణవదేరాయలు, యార్లగడ్డ, కృష్ణమోహన్, ఆనం రామనారాయణరెడ్డి లాంటి కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఈ అంతర్గత కలహాల మూలంగా ప్రజల్లో పార్టీ చులకనైపోతోంది.
పైపెచ్చు కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల మీద అవసరంలేనంత స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొత్తగా కార్పొరేషన్ పదవులు దక్కినవారు మహాశయులమన్నట్టు నిబంధనలను ధిక్కరిస్తున్నారు. అతిగా చేస్తే అనర్థం తప్పదన్నట్టు ఈ ఓవర్ స్పీడ్ కూడ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది. ఈ రెండు రకాలు కాకుండా ఉత్తరాంధ్ర వైపు కొందరి అసంతృప్తులు తయారయ్యారు. వీరు పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది కూడ పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ సమస్యలన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాలనుకున్న జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద సమగ్ర నివేదికను తీసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ముగ్గురు నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రంగంలోకి దింపారట.
ఈ ముగ్గురు జిల్లా ఇంఛార్జ్ మంత్రులతో మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు ఇలా అందరి మీదా రిపోర్ట్ తీస్తున్నారట. పకడ్బంధీగా గూఢచార వర్గాన్ని తయారుచేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారట. ఇలా జరుగుతోందని నేతలందరికీ తెలిసినా నిఘా పెట్టిన ఆ వ్యక్తులు ఎవరనేది తెలియకపోవడంతో అలర్ట్ అయ్యారట అందరూ. పూర్తి నివేదికలు అందాక రెడ్ మార్క్ పెట్టుకున్న నేతలందరినీ టెలికాన్ఫరెన్స్ ద్వారా క్లాస్ పీకే కార్యక్రమం ఉంటుందట. మరి అధిష్టానం ఇవ్వబోయే ట్రీట్మెంట్ అందుకోబోయే నేతలెవరో చూడాలి మరి.