ఎంఎల్ఏలుగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు తదితరులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 12 రోజులకు, సిఎంగా సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న 4 రోజుల తర్వాత జగన్ ఎంఎల్ఏగా ప్రమాణ స్వీకారం చేయటమే విచిత్రంగా ఉంది. అలాగే టిడిపిఎల్పి నేతగా ఎన్నికైన తర్వాతే చంద్రబాబు కూడా ఎంఎల్ఏగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం ప్రోటెం స్పీకర్ గా సంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత మిగిలిన సభ్యులతో సంబంగి ఎంఎల్ఏలుగా ప్రమాణం చేయించారు.
ముందుగా సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణం చేసిన తర్వాత మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుండి ఎంఎల్ఏల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. 15వ శాసనసభలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11.05 గంటలకు మొదలైంది.
సభ్యుల్లో ఎక్కువమంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరిద్దరు మాత్రమే ఇంగ్లీషులో చేశారు. ప్రమాణ స్వీకారాలతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు అంటే 18వ తేదీ వరకూ జరుగుతాయి. ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడతాయి. మొత్తం మీద ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జగన్ అండ్ కో ఉత్సాహంగా పాల్గొంటే చంద్రబాబు అండ్ కోలో మాత్రం తీవ్ర నిరాస కనబడింది.