కష్టానికి ప్రతిఫలం అందుతుందా ? పికెను అభినందించిన జగన్

రెండేళ్ళ తీవ్ర కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వైసిపి తరపున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం దాదాపు రెండేళ్ళ పాటు తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో జగన్ ను సిఎం చేయటానికి వీలుగా ప్రతీ నియోజకవర్గంలోను సర్వేలని, అభిప్రాయ సేకరణని, మ్యానిఫెస్టోలో చర్చించాల్సిన పాయింట్ల పేరుతో ప్రశాంత్ తన ఐ ప్యాక్ బృందంతో విస్తృతంగా తిరిగారు.

జగన్ రేపు గనుక సిఎం అయితే అందులో ప్రశాంత్ కష్టం కూడా ఉందనే చెప్పాలి. జనాలభిప్రాయాలను, ఆకాంక్షలను ప్రశాంత్ తన టీంతో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తు జగన్ కు ఇన్ పుట్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగా జగన్ కూడా తన ప్రాధాన్యతలను మార్చుకుంటు, ఎక్కడ ఎలాంటి హామీలను ఇవ్వాలనే విషయం పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. దాని ఫలితమే పాదయాత్రలో జనాల బ్రహ్మరథం.

అంతెందుకు జగన్ అంటే చంద్రబాబునాయుడు ఎంత భయపడుతున్నారో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ అంటే కూడా అంతే భయపడ్డారు. అందుకనే అనేక సభల్లో కేవలం ప్రశాంత్ గురించే చంద్రబాబు ప్రస్తావించటమే కాకుండా చాలా నీచమైన కామెంట్లు కూడా చేశారు. బీహార్ బంధిపోట్లంటు ప్రశాంత్ గురించి కామెంట్ చేశారంటేనే చంద్రబాబును ప్రశాంత్ ఎంతగా భయపెట్టారో అర్ధమైపోయింది.

అలాంటి ప్రశాంత్ ఏపిలో ఎన్నికలైపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకనే జగన్ ప్రత్యేకించి ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళి వ్యూహకర్త బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.  దాదాపు రెండు గంటలపాటు కార్యాలయంలోనే గడిపారు. మొత్తానికి ప్రశాంత్ ను ఏ కారణంతో అయితే పిలిపించుకున్నారో అది పూర్తియింది కాబట్టి వీడ్కోలు పలికారు.