పోలింగ్ జరగనే లేదు. ఫలితాలూ వెలువడలేదు. అప్పుడే ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులను ఖాయం చేసేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ బహిరంగంగా హామీ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.
మొన్నటికిమొన్న గుంటూరు జిల్లాలో ప్రచారం చేసినపుడు మొదటిసారిగా మంత్రిపదవిని ఖాయం చేసేశారు. మర్రి రాజశేఖర్ కు ఎంఎల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని బహిరంగంగానే హామీ ఇచ్చారు. తాజాగా రెండో మంత్రిపదిని బుధవారం ప్రకటించారు. జగన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆత్మవిశ్వాసం అన్నట్లు కనిపిస్తోంది. కానీ ఫలితాల్లో తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.
జగన్ ఆత్మ విశ్వాసం చాలామందికి ఓవర్ యాక్షన్ లాగ కనిపిస్తోంది. ఓటర్లను ఆకర్షించటానికి అధికారంలోకి వస్తే అది చేస్తామని ఇది చేస్తామని చెప్పటం హామీలివ్వటం మామూలుగా జరిగేదే. అందులో ఏ పార్టీ అధినేతను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పటమంటేనే కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
ఒకసారి చరిత్రను తిరగేస్తే ఓ విషయం గుర్తుకొస్తుంది. 2009లో ప్రజా రాజ్యం పార్టీలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ఇంకా ఎన్నికల షెడ్యూలే విడుదల కాలేదు. చిరంజీవి ప్రచారంలో చాలా బిజీగా ఉండేవారు. హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నేతలంతా సమావేశమయ్యేవారు.
ఆ సందర్భంలో కూడా పిఆర్పి అధికారంలోకి వస్తే మంత్రులుగా ఎవరుంటారు ? వారికి కేటాయించబోయే శాఖలేమిటి ? అనే విషయాలను బహిరంగంగానే చర్చించుకునే వారు. దాంతో ఆ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. ఫలితాల్లో తేడా కొట్టటంతో పిఆర్పి నవ్వులపాలైంది. కాబట్టి జగన్ కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.