ఎన్నికల తర్వాత ఆంధ్రాలో సరికొత్త రాజకీయం పుట్టుకొచ్చింది. అదే ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి మద్దతుపలకడం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాను చంద్రబాబు నాయుడు తరహాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయనని, అక్రమ వలసలను ప్రోత్సహించనని అన్నారు. తన పార్టీలోకి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలి అనుకుంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. దీంతో వైసీపీలోకి వెళ్లాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వేరే రూట్ ఎంచుకున్నారు. వీరు అధికారికంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలుగానే ఉంటారు కానీ బయట మాత్రం వైసీపీ నేతలుగానే వ్యవహరిస్తుంటారు. ఈ పద్దతిలో వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేల్లో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఒకరు.
ఆయన తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలోకి పంపారు. ఆయన మాత్రం అనధికారికంగా వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. వెంకటేష్ అయితే తండ్రి సపోర్ట్ చూసుకుని చెలరేగిపోతున్నారు. వైసీపీ నేత, ఎన్నికల్లో ఓడిన ఆమంచి కృష్ణ మోహన్ మీద పైచేయి సాధించడానికి ట్రై చేస్తున్నారు. దీంతో ఆమంచి, కరణం వర్గాల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. ఈ వేడిలోనే ఇరు వర్గాలు పలుసార్లు ఘర్షణ పడ్డాయి. వెంకటేష్ అయితే బహిరంగంగానే ఆమంచి మీద సవాళ్లు విసురుతున్నారు. నియోజకవర్గంలో అధికారుల నియామకాలు, బదిలీల మీద కూడ పెత్తనం చేసున్నారు. ఇష్టమైన వారిని, అనుకూలమైన వారిని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఆమంచి వర్గానికి అస్సలు నచ్చట్లేదు. ఆమంచి పదవిలో లేకపోయినా పార్టీ అధికారంలో ఉండటంతో చీరాలలో చక్రం తిప్పుతూ వచ్చారు. కానీ కరణం ఎంట్రీతో దానికి గండిపడింది. ఫలితంగా ఆధిపత్య పోరు మొదలైంది. తాము చెప్పిందే వేదం అనేలా కరణం వ్యవహారం ఉండటంతో ఆమంచి తట్టుకోలేకపోతున్నారట. మంత్రి బాలినేని సయోధ్య కుదర్చాలని ట్రై చేసినా కుదరలేదు. దీంతో ఈ సంగతి వైఎస్ జగన్ వరకు వెళ్ళింది. ఆమంచి జగన్ కు మంచి నమ్మకస్థుడు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకున్నాడనే పేరుంది ఆయనకు. ఎన్నికల్లో మాత్రమే ఆయన ఓడారు కానీ జగన్ వద్ద కాదు. ఆయనకు పార్టీలో పూర్తి వేసుకుబాటు ఉంది. ఈ సంగతి తెలిసి కూడ కరణం వర్గం ఆయన్ను తొక్కాలని చూస్తోంది.
ఇదే ముఖ్యమంత్రికి కోపం తెప్పించిందట. తనకు ప్రీతిపాత్రమైన వ్యక్తిని ఇలా ఇబ్బందిపెట్టడం ఆయనకు అస్సలు నచ్చట్లేదట. అందునా టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యే ఇలా చేస్తుండటంతో ఆగ్రహానికి లోనయ్యారట. అందుకే కరణం తనయుడు అధికారుల మార్పులు చేర్పుల విషయమై పంపిన నివేదికను బాలినేని జగన్ వద్ద ఉంచగా ఆయన మరొక ఆలోచన లేకుండా పక్కకు తోసేసి తన అసహనాన్ని వ్యక్తం చేశారట. అంటే ఆమంచి కృష్ణ మోహన్ జోలికి వెళ్లవద్దని జగన్ కరణం బలరాం, ఆయన కుమారుడికి ఇన్‌డైరెక్టుగా వార్నింగ్ ఇస్తున్నట్టే అనుకోవాలేమో.