ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయాలపాలవడం రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేపింది. సింగపూర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అతను అక్కడ ఒక అగ్ని ప్రమాదంకు గురయ్యాడు. ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు సింగపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అభిమానులే కాదు, అన్ని వర్గాల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషాద ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పోస్టు చేశారు.
మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూడా స్పందించారు. “ఈ రోజు పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని ఆమె ట్వీట్ చేశారు.
ఇక ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, సాయంత్రం వరకు తన కార్యక్రమాలను కొనసాగించి, అనంతరం సింగపూర్ వెళ్లనున్నారు. ఇప్పటికే చిరంజీవి, లోకేశ్, కేటీఆర్ తదితరులు కూడా స్పందించి చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు.