ప్రతిపక్షాలకు ఉండే ఏకైక పని పాలక పక్షాన్ని వేలెత్తిచూపడం. చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం. అప్పుడే ప్రజల్లో తన పేరు, పలుకుబడి పెరుగుతాయని అలా చేస్తుంటారు. పాలనలో ఉండే నాయకులు మెతక వైఖరి కలవారు అయితే ప్రత్యర్థుల మాటల దాడికి లొంగిపోతుంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారైనా ప్రతిపక్షాల చిక్కిపోతుంటారు. అదే పీఠం మీద గుండె నిబ్బరం, తెగింపు కలిగిన నాయకుడు ఉంటే సీన్ వేరేలా ఉంటుంది. అది వైఎస్ జగన్ ను చూస్తే అర్థమవుతుంది. ఈమధ్య వచ్చిన కెజిఎఫ్ సినిమాలో హీరో తనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటాడే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గడు. హీరో పాత్రలోని ఆ హీరోయిజమే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి సినిమాను సూపర్ హిట్ చేశారు. జగన్ కూడ అదే పంథాలో సాగిపోతున్నారు.
అక్కడ పాత్ర రీల్ హీరో అయితే ఇక్కడ రాజకీయ క్షేత్రంలో జగన్ పోషిస్తున్నది రియల్ హీరో పాత్ర. ప్రత్యర్థులకు సవాళ్లు విససరడమే కాదు వాళ్ళు వదిలేఛాలెంజులను కూడ స్వీకరించగలగాలి. అప్పుడే అది సాహసమవుతుంది. జగన్ సరిగ్గా అదే చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆయన్ను ఇరుకునపెట్టడానికి ఎలాంటి సవాళ్లు విసిరినా రెడీ అంటున్నారు. ప్రతిదాన్ని స్వీకరిస్తున్నారు. జగన్ పాలన మొదలైన ఇన్ని నెలల్లో ఎక్కడా ఆయన వెనక్కు తగ్గిన సందర్భం లేదు. అనూహ్య పరిణామాల్లో ప్రతిపక్షాలు సీబీఐ దర్యాప్తులకు డిమాండ్ చేసినా సాయి అన్నారు. అంతర్వేది రథం దగ్ధం వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దవి చేయాలని అనుకున్నాయి. అందుకే సీబీఐను రంగంలోకి దింపాలని పట్టుబట్టాయి.
తన పాలనలో సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు కూడ పదే పదే సీబీఐ పేరును జపించారు. మీరంతా ముచ్చటపడితే నేనెందుకు కాదంటాను అన్నట్టు జగన్ సీబీఐను రంగంలోకి దింపారు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రత్యర్థులు అడక్కముందే సీబీఐ, సీఐడీ విచారణకు ఆదేశాలిచ్చి తమవైపు తప్పు లేదని నిరూపించుకున్నారు. తాజాగా జరిగిన రామతీర్థం వివాదంలో ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీలు నానా హంగామా చేశాయి. ఎలాగైనా ప్రభుత్వం పరువును తీయాలని కంకణం కట్టుకున్నాయి. ర్యాలీలు, సందర్శనలు అంటూ గోల చేశాయి. వాళ్ళ ఆటలన్నీ చూసిన జగన్ నోరెత్తకుండా సీబీఐ విచారణకు సీఐడీ విచారణకు ఆదేశించి అందరి నోళ్లకు తాళం వేశారు. ఇప్పుడు ప్రతిపక్షాల వద్ద జగన్ మీద దాడి చేయడానికి ఎలాంటి అస్త్రాలు లేవు. పైగా మూడు నాలుగు రోజుల్లో నిందితులను పట్టుకుని కేసును తేల్చేస్తామని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఇలా జగన్ ఎక్కడికక్కడ ప్రత్యర్థులకు ఎదురెళుతూ, సవాళ్ళను స్వీకరిస్తూ కెజిఎఫ్ హీరోను గుర్తుచేస్తున్నారు.